సిటీబ్యూరో, 15 (నమస్తే తెలంగాణ)/బన్సీలాల్ పేట/చార్మినార్/ఖైరతాబాద్: గ్రేటర్ పరిధిలోని 7 ప్రభుత్వ దవాఖానలు, 5 వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయాలతో పాటు 839 ప్రైవేటు దవాఖానల్లో లిఫ్ట్‌లను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నిలోఫర్, ఎంఎన్‌జే తదితర ప్రభుత్వ రంగ దవాఖానల్లో ప్రతి నిత్యం వేలాది మంది రోగులు వైద్య సేవల కోసం లిఫ్ట్‌లను ఆశ్రయిస్తుంటారు. వీరితో పాటు కార్పొరేట్, ప్రైవేటు రంగ దవాఖానల్లో సైతం వేల సంఖ్యలో రోగులు లిఫ్ట్‌లను వినియోగిస్తున్నారు.
దవాఖానల్లో అనారోగ్యంతో వచ్చే రోగులు, వారి సహాయకులు, వైద్యసిబ్బంది లిఫ్ట్‌లను వినియోగిస్తారు. కొన్ని కార్పొరేట్ దవాఖానల్లో 18 అంతస్తుల వరకు వైద్యసేవలు అందుబాటులో ఉంచడంతో రోగులు ఆర్టీసీ బస్సుల మాదిరిగా లిఫ్ట్‌ల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందంటే దవాఖానల్లో లిఫ్ట్‌లు ఎంత అత్యవసరమో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంత అత్యవసరమైన ఈ లిఫ్ట్‌ల పర్యవేక్షణ, పరిపాలనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో లిఫ్ట్‌ల మెయింటనెన్స్ తూతూ మంత్రంగా ఉంటున్నాయి. తరచూ అవి మరమ్మతులకు గురికావడం, మధ్యలోనే ఆగిపోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తడం వంటి ఘటనలు సర్వసాధారణంగా మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైనా ఘటన జరిగితే తప్ప విషయం బయటకు రాని పరిస్థితి నెలకొన్నదని రోగులు ఆరోపిస్తున్నారు.
రోగుల భద్రత గాలికి..
కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో రోగుల కోసం, వైద్య సిబ్బంది కోసం వేర్వేరుగా లిఫ్ట్‌లను అందుబాటులో ఉంచారు. కొన్ని దవాఖానల్లో రోగుల భద్రతను గాలికొదిలేస్తున్నారు. అటు సరైన మెయింటనెన్స్ లేకపోవడమే కాకుండా లిఫ్ట్‌లో ఆపరేటర్లను నియమించడకపోవడంతో లిఫ్ట్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడినప్పుడు రోగులు ప్రమాదంలో చిక్కుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే మూడురోజుల కిందట గాంధీ దవాఖానలో సాంకేతిక సమస్యల కారణంగా మధ్యలో నిలిచిపోయిన లిఫ్ట్‌లో ఒకేసారి దాదాపు 20మంది వరకు రోగులు, వారి సహాయకులు చిక్కుకున్నారు. ఆ సమయంలో లిఫ్ట్‌లో ఆపరేటర్ ఉండి ఉంటే రోగులకు ఇబ్బందులు తప్పేవి. కానీ ఆపరేటర్ లేకపోవడంతో దాదాపు 30నిమిషాల పాటు వారు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. తీరా సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే వచ్చి వారిని క్షేమంగా బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. ఇలాంటి ఘటనలు తరచూ ప్రభుత్వ రంగ దవాఖానల్లోనే కాకుండా ప్రైవేటు రంగ దవాఖానల్లో సైతం జరుగుతున్నా సంబంధిత అధికారులు గాని, యాజమాన్యాలు గాని పట్టించుకోవడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు.
గాంధీ దవాఖానలో..
గాంధీ హాస్పిటల్ లో మొత్తం 12 లిఫ్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. దవాఖానలోని ప్రధాన భవనంలో 9, మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్) భవనంలో మూడు లిఫ్ట్‌లు ప్రస్తుతం పని చేస్తున్నాయి. అయితే ప్రధాన భవనంలో ఉన్న వైద్యసిబ్బంది వినియోగించే లిఫ్ట్‌లలో మాత్రమే ఆరుగురు లిఫ్ట్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. మూడు షిఫ్ట్‌లలో వారు విధులు నిర్వహిస్తున్నారు. కానీ రోగులు వినియోగించే లిఫ్ట్‌లలో ఆపరేటర్లు లేకపోవడంతో భద్రత ప్రశ్నార్థకంగా (మిగతా 2వ పేజీలో)