సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ) : నిజాంకాలం నాటి ఖగోళ అధ్యయన కేంద్రానికి పూర్వవైభవం రానున్నది. అమీర్‌పేట్‌లోని నిజామియా అబ్జర్వేటరీ పూర్తిగా శిథిలావస్థకు చేరింది. హ్యాపీ హైదరాబాద్ పేరిట అమీర్‌పేట సెస్‌లో హెరిటేజ్ వాక్‌ను నగరవాసులు మంగళవారం నిర్వహించారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా చారిత్రక అధ్యయన కేంద్రాన్ని పరిరక్షించాలని వారు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించడంతో శిథిలావస్థకు చేరిన నిర్మాణానికి మళ్లీ మంచి రోజులు రానున్నాయి. పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ట్విట్టర్లో స్పందిస్తూ పూర్వవైభవానికి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిటీ మధ్యలో ఉంటూ కాలగర్భంలో కలిసిపోయేలా మారిన పరిశోధన కేంద్రానికి మరమ్మతులు చేయాలని మంత్రి కేటీఆర్ దృష్టికి నగరవాసులు తీసుకువచ్చారు.
నిజాం కాలంలో ఖగోళ పరిశోధనలు
ప్రపంచంలోనే అరుదైన ఖగోళ పరిశోధన కేంద్రంగా నిజామియా అబ్జర్వేటరీకి గుర్తింపు ఉంది. 1909లో అమీర్‌పేట్‌లో ఈ కేంద్రాన్ని అప్పటి నిజాం రాజులు ఏర్పాటు చేశారు. ఇకడి నుంచే ఖగోళ శాస్త్ర పరిశోధనలు చేసేందుకు ఖగోళదర్పణిని నిర్మించారు. ఇది భూకంపాల సమాచారాన్ని, వాతావరణ, ఉష్ణోగ్రతల్లోని మార్పులతో పాటు సమయాన్ని కూడా సూచించేందుకు దీనిని వినియోగించేవారని చరిత్రకారులు చెబుతున్నారు. 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నెలకొల్పిన తర్వాత అబ్జర్వేటరీని ఉస్మానియా వర్సిటీలోకి బదిలీ చేశారు. అప్పట్లోనే ఖగోళ శాస్త్ర ప్రయోగశాలను కలిగి ఉన్న వర్సిటీగా ఉస్మానియాకు గుర్తింపు ఉండేది. నోబెల్ బహుమతి పొందిన సర్ సీ.వీ. రామన్, ప్రొఫెసర్ ఎస్.చంద్రశేఖర్ వంటి శాస్త్రవేత్తలు దీనిని సందర్శించినట్లుగా చెబుతారు. ఎంతో ఘన కీర్తిని ఉన్న నిజామియా అబ్జర్వేటరీని హైదరాబాద్ పట్టణ అభివృద్ధి సంస్థ(హుడా) వారసత్వ కట్టడంగా గుర్తించింది.