బంజారాహిల్స్, మే 20: ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని షేక్‌పేట మండల తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. షేక్‌పేట మండలం బంజారాహిల్స్ రోడ్ నం. 14లోని సర్వే నంబర్ 403/పీ, టీఎస్ నం బర్ 17, బ్లాక్-డీ, వార్డ్-10లోని సుమారు ఒక ఎకరం ప్రభుత్వ స్థలాన్ని బోగస్ పత్రాలతో కబ్జా చేసేందుకు అబ్దుల్ ఖలీద్ గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఈ క్రమంలో అతడిపై 2020లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదయ్యింది. ఈ క్రమంలో తాజాగా సోమవారం రాత్రి అబ్దుల్ ఖాలీద్ పేరుతో సంబంధిత ప్రభుత్వ స్థలం బయట పోస్టర్లు వెలిశాయి. స్థలంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను దుండగులు తొలగించారు. సమాచారం అందుకున్న షేక్‌పేట రెవెన్యూ సిబ్బంది అబ్దుల్ ఖాలీద్ పేరుతో ఏర్పాటు చేసిన పోస్టర్లను తొలగించారు.
ఈ మేరకు నిందితుడు అబ్దుల్ ఖలీద్ మీద చర్యలు తీసుకోవాలంటూ షేక్‌పేట మండల తహసీల్దార్ అనితారెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ స్థల వ్యవహారంలో గతంలో షేక్‌పేట తహసీల్దార్ సుజాతతో పాటు ఒక ఆర్ఐ, బంజారాహిల్స్ ఎస్ఐ రవీందర్ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే.
కాగా ఆ సమయంలో పోలీసుల విచారణలో అబ్దుల్ ఖలీద్ పత్రాలు బోగస్ వి అని తేలడంతో సీసీఎస్‌లో సైతం అతడిపై కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు. తాజాగా బంజారాహిల్స్ రోడ్ నం 14లోని ప్రభుత్వ స్థలంపై మరోసారి అబ్దుల్ ఖలీద్ కన్నేయడంతో అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు, స్థానికులు కోరుతున్నారు.