జీడిమెట్ల, ఏప్రిల్ 24: ఇంట్లో ఎవరూలేని సమయంలో కిటీకి గ్రిల్స్ తొలగించి ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లిన గజ దొంగను జీడిమెట్ల పోలీసులు గురువారం అరెస్టు చేసి అతడి వద్ద ఉన్న రూ.11.5లక్షల సొత్తు రికవరీ చేసి రిమాండ్‌కు తరలించారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేశ్, డీఐ కనకయ్య వివరాలు వెల్లడించారు. అపురూపకాలనీకి చెందిన పింటూ అనే వ్యక్తి మార్చి 5వ తేదీన కుటుంబసభ్యులతో కలిసి వారి సొంతూరికి వెళ్లాడు. మరునాడు ఉదయం సీసీ కెమెరాలను పరిశీలించిన పింటూ ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు.
వెంటనే విషయాన్ని పింటూ బావ మరిదికి తెలుపగా.. అతడు ఈ విషయమై 6వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దొంగతనం చేసిన వ్యక్తి బేగరి వేణుగోపాల్‌పై 44 కేసులు పీడీ యాక్టు ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 150 సీసీ కెమెరాలను పరిశీలించడంతోపాటు కొన్ని టెక్నికల్ ఆధారాలతో దొంగతనం చేసిన వ్యక్తి వేణుగోపాల్(26), సంపత్ సాయి (20)గా గుర్తించారు. బుధవారం సాయంత్రం వేణుగోపాల్‌ను జీడిమెట్ల పోలీసులు అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి రూ.11.5లక్షల విలువజేసే బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, మరో నిందితుడు సంపత్సాయి పరారీలో ఉన్నాడు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి వేణుగోపాల్‌ను రిమాండ్‌కు తరలించారు. కాగా, వేణుగోపాల్ సైబరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇప్పటికే 44 కేసుల్లో నిందితుడిగా ఉండగా.. గతంలో దుండిగల్ పీఎస్ నుంచి పీడీ యాక్టు ద్వారా సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు. జీడిమెట్ల పోలీసులు సైతం వేణుగోపాల్‌పై పీడీయాక్టు కోసం రెకమండ్ చేశారు.