లక్ష్మీదేవిపల్లి, జనవరి 3 : రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెలు మృత్యువాత పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకున్నది. పూర్తి వివరాల్లోకెళ్తే.. జిల్లాలోని చుంచుపల్లి మండలం బాబూక్యాంప్ ఏరియాకు చెందిన అన్నాచెల్లెలు నకిరికంటి నీరజ్(27), నకిరికంటి నిహారిక(23) స్నేహితురాలైన విద్యానగర్‌కాలనీకి చెందిన జలగం మేరీ ముగ్గురూ కలిసి సోమవారం రాత్రి పాల్వంచలో ఉన్న రెస్టారెంట్‌కు వెళ్లారు. తిరిగి 11గంటల తర్వాత పాల్వంచ నుంచి వస్తున్న క్రమంలో మండలంలోని రేగళ్ల క్రాస్‌రోడ్ సమీపంలో నీరజ్ ద్విచక్ర వాహనం ఢివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నీరజ్, నిహారిక అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మేరీ తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న లక్ష్మీదేవిపల్లి ఎస్సై ప్రవీణ్ అక్కడికి చేరుకొని వారిని 108 ద్వారా కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మేరీ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. పోస్టుమార్టం అనంతరం నీరజ్, నిహారిక మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. బైక్‌ను అతివేగంగా నడపడం వల్లనే ప్రమాదానికి కారణమని ప్రత్యక్షసాక్షి తెలిపినట్లు ఎస్సై పేర్కొన్నారు. నిహారికకు హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. మరో రెండ్రోజుల్లో జాబ్‌లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అన్నాచెల్లెలు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధించారు. మృతుడి పెదనాన్న కుమారుడు రోహిత్‌కుమార్ ఫిర్యాదు మేరకు లక్ష్మీదేవిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం బాబూక్యాంప్‌లో అన్నాచెల్లెల అంత్యక్రియలు నిర్వహించారు.