నగరంలోని అంగన్వాడీ కేంద్రాలు ఆకర్షణీయంగా మారనున్నాయి. నిన్నమొన్నటి వరకు ఇరుకైన గదుల్లో ఉన్న ఈ స్కూళ్లు సొంత భవనాలతో విశాలం కానున్నాయి. అబ్బురపరిచేలా, ఆకట్టుకునేలా, ఆదర్శ అంగన్వాడీ కేంద్రాలకు అంకురార్పణ చేస్తున్న అధికారులు బస్తీ బడులకు కొత్త భాష్యం చెబుతున్నారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజల పిల్లలు ఆడుతూ పాడుతూ విద్యాభ్యాసాన్ని చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
జూబ్లీహిల్స్, సెప్టెంబర్ 21: పేద, సామాన్యుల పిల్లలకు పోషకాహారాన్ని అందించే అంగన్వాడీలు కొత్తరూపు సంతరించుకోనున్నాయి. ఇప్పటి వరకు సామాజిక భవనాలు, చిన్న చిన్న అద్దె గదుల్లో కొనసాగుతున్న ఈ కేంద్రాలు ఇకపై ప్లే స్కూల్ తరహాలో రూపాంతరం చెందనున్నాయి. ఆకర్షణీయమైన పరిసరాలతో ఆకట్టుకోనున్నాయి. హైదరాబాద్ జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన యోగితారాణా, శ్వేతా మహంతిల ప్రత్యేక కార్యాచరణతో గ్రేటర్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు సమకూర్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
గ్రేటర్ పరిధిలో ఉన్న 914 అంగన్వాడీ కేంద్రాలు ఉంటే అందులో 16 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలున్నాయి. దీంతో నగరవ్యాప్తంగా రెవెన్యూ, ఐసీడీఎస్ అధికారులు విస్తృతస్థాయిలో సర్వేలు నిర్వహించి అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుకు స్థలాల అన్వేషణ చేపట్టారు. అంతేకాక అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మిస్తే ఎలా ఉండాలన్న దానిపై అధికారుల బృందం అధ్యయనం చేసింది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దిన అధికారులు నగరంలో ప్లే స్కూల్స్‌కు పోటీగా అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంకల్పించారు.
సంపన్న వర్గాలు తమ పిల్లలను ప్లే స్కూల్స్‌కు పంపినట్లుగా పేద, సామాన్య ప్రజలు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని భావించిన అధికారులు ఈ మేరకు వాటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మోడల్ అంగన్వాడీ కేంద్రానికి రూపకల్పన చేశారు. నాట్కో సంస్థ భాగస్వామ్యంతో రూ.25 లక్షల వ్యయంతో మోడల్ అంగన్వాడీ భవనాన్ని నిర్మించనున్నారు. రహ్మత్‌నగర్ డివిజన్ ఆరోగ్యనగర్ బస్తీలో బుధవారం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నేతృత్వంలో ఈ మోడల్ అంగన్వాడీ కేంద్రానికి భూమి పూజ చేయనున్నారు.
అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలతో పాటు విశాలమైన ఆటస్థలం, అలరించే ఆటవస్తువులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం. నగరంలో చేపడుతున్న మోడల్ భవనాన్ని ఆదర్శవంతంగా నిర్మిస్తాం. నాట్కో ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ భవనాన్ని గడువు లోగా పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం. ఆకేశ్వర రావు, హైదరాబాద్ జిల్లా సంక్షేమ శాఖ అధికారి