ఆర్కే పురం, జూన్ 24: సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థులను తొలగించేందుకు వీఎం హోమ్ ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో ఇప్పటికే కొంతమంది విద్యార్థులకు టీసీ, బోనఫైడ్లను ఇచ్చి పంపించారు. వివరాల్లోకి వెళ్తే సరూర్గనర్లోని వీఎం హోమ్ రెసిడెన్షియల్ పాఠశాల కేవలం తల్లిదండ్రులు లేని, తల్లి గాని తండ్రి గాని లేని అనాథ పిల్లలకు ఉచితంగా విద్యను అందించే కేంద్రం.
ఇక్కడ సుమారు 900 మంది అనాథ విద్యార్థులు 1వ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుకుంటున్నారు. కాగా ఇందులో కేవలం అనాథ విద్యార్థులకే సీటు కేటాయించి విద్యనందించాలి. కానీ గతంలో పాఠశాల ఉపాధ్యాయులు.. విద్యార్థులు తక్కువగా ఉన్నారని ఇష్టానుసారంగా నిరుపేద విద్యార్థులను చేర్పించుకొని ఇప్పుడు వారికి తల్లిదండ్రులు ఉన్నారని అర్థాంతరంగా పంపిస్తే తమ పిల్లలను ఎక్కడ చదివించాలని విద్యార్థుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు కావస్తున్నా వీఎం హోమ్ పాఠశాలలో ఆంధ్ర ఉపాధ్యాయుల పెత్తనం నడుస్తోందని విద్యార్థుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై ఎమ్మెల్యే సబితారెడ్డిని కలవగా.. ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడారు. విద్యార్థులకు న్యాయం చేస్తానని తల్లిదండ్రులకు సబితారెడ్డి హామీ ఇచ్చారు.