సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ): బెట్టింగ్ యాప్స్ మూలాలపై నగర పోలీసులు గురిపెట్టారు. ఇప్పటివరకు యాప్స్‌ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పుడు యాప్ యజమానులపై చర్యలకు రెడీ అయ్యారు. మొత్తం 19 మంది బెట్టింగ్ యాప్ ఓనర్లపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. జంగిల్ రమ్మి డాట్ కామ్, ఏ 23, యోలో 247, ఫెయిర్‌ప్లే, జీత్‌విన్, విబుక్, తాజ్77, వివి బుక్, ధనిబుక్ 365, మామ 247, తెలుగు 365, ఎస్ 365, జై 365, జెట్ఎక్స్, పరిమ్యాచ్, తాజ్777బుక్, ఆంధ్రా365 యజమానులపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
ఇప్పటికే సినీ ప్రముఖులు, ఇన్ఫ్లూయెన్సర్లు సహా 25 మందిపై కేసులు పెట్టారు. తాజాగా యాప్‌ల యజమానులపై కేసులు నమోదు చేసి మొత్తం 19 మందిని నిందితులుగా చేర్చి విచారణ చేపట్టనున్నారు. ఇందుకోసం కేసులో కొత్త సెక్షన్లను జోడిస్తున్నారు. వారిని విచారించేందుకు అనుమతులు ఇవ్వాలంటూ మియాపూర్ కోర్టులో పోలీసులు మెమోలు దాఖలు చేశారు. ఇప్పటివరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఐదుగురిని పోలీసులు విచారించారు.
మరో ఆరుగురిని విచారించాల్సి ఉండగా.. వారు మాత్రం అందుబాటులో లేరు. ఇమ్రాన్, హర్షసాయి దుబాయ్‌లో ఉన్నట్లు తమకు సమాచారమందుతుందని, మిగతా వారు కూడా వేరే ప్రాంతాలకు పారిపోయినట్లు తెలుస్తున్నదని పోలీసులు చెప్పారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన ఇన్ఫ్లూయెన్సర్లు, యూ ట్యూబర్లు, నటులపై కేసులు పెట్టి వారి స్టేట్మెంట్ల ఆధారంగా మరికొన్ని వివరాలు సేకరించిన పోలీసులు నిర్వాహకులపై కూడా కేసులు పెట్టారు. ఇన్ఫ్లూయెన్సర్లను సాక్షులుగా చూపెట్టే అవకాశమున్నట్లుగా తెలుస్తున్నది. ఇల్లీగల్ బెట్టింగ్‌కు నిర్వాహకులే బాధ్యులంటూ పోలీసులు ప్రాథమికంగా సాక్ష్యాధారాలు సేకరించారు. ఈ మేరకు వారిని విచారించడానికి అనుమతించమంటూ కోర్టును కోరారు.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌కు సంబంధించిన కేసులో సోమవారం యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. తన అడ్వకేట్‌తో కలిసి వచ్చిన శ్యామలను పోలీసులు మూడున్నర గంటలకుపైగా విచారించారు. తాను ప్రమోట్ చేసిన యాప్‌ల వివరాలతో పాటు యాప్‌ల ప్రమోషన్ ద్వారా వచ్చిన ఆదాయం, బ్యాంక్ ఖాతాల వివరాలను పోలీసులు పరిశీలించారు. ఆ తర్వాత తాను ప్రమోషన్ చేయడానికి ప్రోత్సహించిందెవరనే కోణంలో శ్యామల విచారణ జరిగినట్లుగా సమాచారం. అయితే తాను పోలీస్ విచారణకు పూర్తిగా సహకరిస్తానని, బెట్టింగ్‌లకు పాల్పడటం తప్పు అని శ్యామల అన్నారు.
బెట్టింగ్‌యాప్‌లకు సంబంధించిన కేసులో ఇప్పటి వరకు టేస్టీతేజ, కానిస్టేబుల్ కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, రీతూచౌదరి, యాంకర్శ్యామలను పంజాగుట్ట పోలీసులు విచారించారు. వీరితో పాటు మరికొందరిపై కేసులు పెట్టినప్పటికీ వారెవరూ ఇప్పటివరకు పీఎస్‌కు రాలేదు. ఇందులో ఇమ్రాన్, హర్షసాయి దుబాయ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరికొందరు పరారీలో ఉన్నారని, విదేశాల్లో ఉన్నవారికి లుక్అవుట్ నోటీసులు ఇస్తామని పోలీసులు చెప్పారు.
మాదాపూర్, మార్చి 24: బెట్టింగ్ యాప్స్ పై ప్రమోషన్ చేస్తున్న పలువురు సెలబ్రిటీలపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఈనెల 19వ తేదీన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 మందిపై కేసులు నమోదు చేయగా.. తాజాగా సినీ నటుడు రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్ తో సహా మొత్తం 25 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితుల జాబితాలో 19 బెట్టింగ్ యాప్‌ల యజమానులకు పోలీసులు త్వరలోనే నోటీసులు అందజేసి విచారణ చేపట్టేందుకు సన్న హాలు చేస్తున్నారు. ఇందులో ఏ -23 జిగీల్ రమ్మీ డాట్ కామ్, యోలో 247, ఫెయిర్ ప్లే, జీత్ విన్, వి బుక్, తాజ్ 77, ధని బుక్ 365, మామ 247, తెలుగు 365, ఎస్ 365, జె 365, జెట్ ఎక్స్, ప్యారీ మ్యాచ్, కాజు 777 బుక్, ఆంధ్ర 365 యాప్‌ల నిర్వాహకులు ఇందులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఖైరతాబాద్, మార్చి 24 : బెట్టింగ్ యాప్ ఇన్‌ప్లూయెన్సర్లు, ప్రమోట్ చేసిన వారిపై కొరడా ఝలిపిస్తున్న నేపథ్యంలో కొందరు సెలబ్రిటీలపైనా కేసులు పెట్టాలంటూ ఓ యువకుడు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. సోమవారం సాయంత్రం పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ ఆవరణలో కమలాపురికి చెందిన హైదరాబాద్ గ్రీన్ సంస్థ అధ్యక్షుడు అర్జున్ గౌడ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. బెట్టింగ్, గేమింగ్ యాప్‌లను సినీనటుడు షారుఖాన్, క్రికెట్ స్టార్ సచిన్, విరాట్ కోహ్లీ సైతం ప్రమోట్ చేశారని ఆరోపించారు. దానికి సంబంధించిన పత్రాలు ఉన్నాయని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించగా, బంజారాహిల్స్‌లో ఫిర్యాదు చేయాలని అక్కడి నుంచి పంపించి వేశారు.