సిటీబ్యూరో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): నగరంలో రియల్ ఎస్టేట్ అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్న చందంగా మారింది. రెండేళ్ల పాలనతోనే రియాల్టీ నడ్డి విరిచినట్లుగా చేసిన రేవంత్ సర్కారు పుణ్యామాని నగరంలోని ఇండ్లు అమ్ముడుపోకుండా మూలుగుతున్నాయి.
సిటీబ్యూరో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): నగరంలో రియల్ ఎస్టేట్ అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్న చందంగా మారింది. రెండేళ్ల పాలనతోనే రియాల్టీ నడ్డి విరిచినట్లుగా చేసిన రేవంత్ సర్కారు పుణ్యమాని నగరంలోని ఇండ్లు అమ్ముడుపోకుండా మూలుగుతున్నాయి. నిజానికి నగరంలో ఏటా లక్షన్నర నుంచి రెండు లక్షల ప్లాట్లు అందుబాటులోకి వస్తే.. ఇందులో 60-70 శాతం మేర విక్రయాలతో సర్దుబాటు జరిగేది. కానీ కాంగ్రెస్ తీసుకువచ్చిన హైడ్రా, అడ్డగోలు కూల్చివేతలతో అన్ని అనుమతులున్నా.. కొనేందుకు కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు. దీంతో రెండేళ్ల విధ్వంసకర పాలన తీరుకు ఈ సమస్య అద్దం పడుతున్నది.
అమ్ముడుపోని యూనిట్లు 97,950..
ఆర్థిక సంక్షోభం, కరోనా లాంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడిన హైదరాబాద్ రియాల్టీ.. రేవంత్ సర్కారు చేసిన విధ్వంసానికి విలవిల్లాడుతున్నది. నిర్మించింది అమ్మలేక, కొత్తది కట్టేందుకు ముందుకు పోక, కట్టేందుకు అనుమతులు పొందలేక బడా నిర్మాణ సంస్థలతో పాటు, స్మాల్ అండ్ మీడియం స్థాయి బిల్డర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇక భవిష్యత్ పెట్టుబడి కోసం కొనుగోలు చేసి, పెట్టుకున్న పేద, మధ్యతరగతి వర్గాల బాధలైతే వర్ణనాతీతంగా ఉన్నాయి. కాంగ్రెస్ సంక్షోభం పేరిట కొనుగోలు చేసిన దాని కంటే సగం రేటు కూడా రాకపోవడంతో అమ్మకందారులు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు.
కనీసం పెట్టిన పెట్టుబడి వచ్చిన.. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉందనీ మార్కెట్లోకి తీసుకువచ్చిన కొనుగోలుదారులు ముందుకు రాక తీవ్రంగా నష్టపోతున్నారు. ఇవే అంశాలను తాజాగా రెసిడెన్షియల్ మార్కెట్ స్థితిగతులను అంచనా వేస్తూ ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో పేరుకుపోతున్న అమ్ముడుపోనీ నిర్మాణ సంఖ్యను వెల్లడించగా… ఇందులో హైదరాబాద్ మూడో స్థానంలో, ఢిల్లీ, ముంబై వంటి నగరాలతో పోటీ పడుతున్నది. 2025 తొలి త్రైమాసికంలో నగరంలో అమ్ముడుపోని యూనిట్ల సంఖ్య 97,950గా ఉందని అంచనా వేసింది. ఇక కోర్ సిటీతో కలుపుకొంటే ఈ సంఖ్య లక్షకు చేరువలో ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.

గతి తప్పుతున్న హైదరాబాద్ ఖ్యాతి..
మెరుగైన మౌలిక వసతులు, అంతర్జాతీయ స్థాయి మానవ వనరులు, పుష్కలమైన వృద్ధి రేటుతో దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే హైదరాబాద్ గడిచిన ఐదారేళ్లు దూసుకుపోయింది. దీంతో నగరంలో ఐటీ, ఐటీయేతర పెట్టుబడులతో పాటు, ఉపాధి అవకాశాలతో రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో అనుకూలంగా మారింది. కానీ నగరంలో గడిచిన రెండేళ్లుగా కాంగ్రెస్ మార్క్ పాలనతో ఈజ్ ఆఫ్ డూయింగ్ వ్యవహారాలు మందగించాయి.
పెట్టుబడులకు ఎలాంటి భరోసా లేకపోవడంతో బిల్డర్లు కూడా వెనకడుగు వేశారు. ఉన్న ప్లాట్లను విక్రయించుకుంటే చాలు.. మూడేళ్ల వరకు కొత్త ప్రాజెక్టుల జోలికి వెళ్లకపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారు. దీంతోనే వడ్డీ రేట్లు తగ్గించినా, జీఎస్టీలో మార్పులు జరిగినా, కాంగ్రెస్ సర్కారు చెబుతున్నట్లుగా ధరల సర్దుబాటు జరుగుతుందని చెబుతున్నా అమ్మకాలు పెరగడం లేదు. దీంతో ప్రాజెక్టుల్లో వందలాది యూనిట్లు పడావ్ పడుతూ రియల్ ఎస్టేట్ గతి తప్పినట్లుగా మారింది.
వెస్ట్లోనే ఎక్కువ
ఒకప్పుడు రెసిడెన్షియల్, కమర్షియల్ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఐటీ కారిడార్ విస్తరించిన వెస్ట్ సిటీ.. ఇప్పుడు అమ్మకాలు లేక ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. నిజానికి కమర్షియల్ కార్యకలాపాలు కూడా లేకపోవడంతో ప్రాజెక్టులకు ఆదరణ రావడం లేదనీ, పట్టణ మౌలిక వసతులను అభివృద్ధి కుంటుపడటంతోనే వెస్ట్ సిటీలో గచ్చిబౌలి, రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో రెసిడెన్షియల్ సెగ్మెంట్ డీలా పడిందని, ఇక చెప్పుకోదగిన సంస్థలు పెట్టుబడులతో ముందుకు రాకపోవడం కూడా హైదరాబాద్ నిర్మాణ రంగం కొట్టుమిట్టాడుతున్నదని ‘రియల్’ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.