దుండిగల్, జూలై 7: బహదూర్‌పల్లి వద్ద జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్ పైకి ఎక్కింది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జీడిమెట్ల ఆర్టీసీ బస్సు డిపోకు చెందిన 272 రూట్ బస్సు ఆదివారం సాయంత్రం గండిమైసమ్మ చౌరస్తా నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా.. సూరారం కట్టమైసమ్మ చెరువు సమీపంలోకి రాగానే అదుపుతప్పి డివైడర్ పైకి ఎక్కింది. ఈ ప్రమాదంలో ఆ బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 11 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సూరారం పోలీసులు చికిత్స నిమిత్తం సమీపంలో ఆస్పత్రికి తరలించారు.