తెలుగు యూనివర్సిటీ, ఫిబ్రవరి 3: చిత్రకళా చరిత్రను, చిత్ర కళా వారసత్వాన్ని భావితరాలకు అందించాలనే సంకల్పం వందేళ్ళ కాలం నాడే తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు మదిలో మొలిచింది. ప్రాచ్య శైలి, ప్రాంతీయ ప్రజా జీవితము శేషగిరిరావు కుంచె నుంచి కలగలిపి ప్రవహించిన ఆయిల్ పెయింటింగ్స్, మ్యురల్స్, ఆక్వాటెక్చర్ పెయింటింగ్ తదితర అందమైన చిత్రాల సమాహారంగా మాదాపూర్లో గల చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కొలువుదీరింది. శేషగిరిరావు చిత్రకళా వైదుష్యానికి నిదర్శనంగా ఈ కళా ప్రదర్శన నిలిచింది.
ఆయన చేతిలో రూపుదిద్దుకున్న కళా, సౌందర్య చిత్రాలు వీక్షకులకు, వర్థమాన సృజనాత్మక కళాకారులకు చిత్రకళ పట్ల అభిరుచిని పెంచుతాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రాంతీయతకు, జాతీయతకు పెద్ద పీట వేస్తూ సాగించిన ఆయన కళాఖండాలు ఆయన ఆలోచనా శైలికి, దార్శనికతకు అద్దం పడుతుంది. 1940 కాలం నుంచి ఇటీవల 2012 వరకు ఆయన జీవిత కాలంలో గీసిన వైవిధ్యభరితమైన 250 చిత్రకళా ఖండాల ప్రదర్శన కళాప్రియులకు ఒక సందేశాన్ని అందిస్తోంది. ఫిబ్రవరి 5వరకు కొనసాగనున్న ఈ చిత్రకళా ప్రదర్శన భావితరాల కళాకారులకు ఒక నిఘంటువుగా నిలవనుంది.
రావు చిత్రాలలో భారతీయ కళా తత్వాలు..
భారతీయ కళా తత్వాలను వివరించేలా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలలోని చారిత్రక స్థలా ల శిల్పకళా వైభవాన్ని శేషగిరిరావు నేటి తరానికి పరిచయం చేసిన ఆధునిక రుషి. హంపీ, లేపాక్షి, కాకతీయ శిల్పకళా వైభవంతో పాటు నకాషీ పట చిత్రకళను ప్రపంచానికి పరిచ యం చేసి చారిత్రక, సాంస్కృతిక పరిరక్షకుడిగా నిలిచారు. ప్రాచీన చిత్రకళా వారసత్వాన్ని శేషగిరి రావు శతాబ్ధి వేడుకల సందర్భంగా మరోసారి నేటి తరం వీక్షించి స్ఫూర్తి పొందేందుకు ఇదొక అద్భుత అవకాశం. ఫిబ్రవరి 5తో ఈ ప్రదర్శన ముగియనుంది.
రివైవింగ్ ది రూట్స్ ప్రత్యేకత..
ఇతిహాసాలు, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానాలను మనస్సులోని భావాలను జోడించి అందమైన చిత్రాలుగా రూపొందించిన కొండపల్లి శేషగిరిరావు కళా ప్రతిభను చూడడానికి రెండు కళ్ళు చాలవు అన్నట్లుగా చూపరుల మదిలో చిరస్థాయిగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు. జన్మతః బొమ్మలు వేయడంలో వచ్చిన అభిరుచితో రామప్ప, వేయి స్థంభాల ఆలయాల శిల్పాలు తదితర అసంఖ్యాక చిత్రాలు కొలువై ఉన్నాయి. ఆయనలోని సృజనాత్మక చిత్రకళా సౌందర్యాన్ని వీక్షించడానికి ప్రతి ఒక్కరు సమయం కేటాయించి ఆర్ట్ గ్యాలరీని సందర్శించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ‘కలువల కొలనులో కలువ కనుల సుందరి, పల్లెల రమణీయత, ప్రకృతి’ దృశ్యాలు ఆయన తన చిత్రాల ద్వారా మన కళ్ళకు కట్టారు. ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలోని ప్రజల జీవన శైలి, వైవిధ్య జీవితం సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతాయనడంలో అతిశయోక్తి లేదు. ఆయన గీసిన చిత్రాలలోని భంగిమలు, హావభావాలు కాకతీయ శిల్పాల గురించి లోతైన అవగాహనతో రూపొందించినవిగా చెప్పవచ్చు. శిల్పానుగుణమైన చిత్రాల్లో ప్రాచ్య, తాత్వికతా, ఆధ్యాత్మికత కలగలిపి చూపరులకు ఏవో అతీత భావనలు కలిగించారు శేషగిరిరావు.