హిమాయత్ నగర్ , జూన్ 28: జీహెచ్ఎంసీ, రాంకీ సంస్థ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ వృద్ధురాలి నిండు ప్రాణం బలైంది. ఈ ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్ లింగంపల్లికి చెందిన రేఖ (60) ఒంటరిగా ఉంటూ జీవనం సాగిసున్నది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉండగా, 15 ఏండ్ల కిందట ఆమె భర్త మృతి చెందాడు.
శుక్రవారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వచ్చిన రేఖ నారాయణ గూడ గాంధీకుటీర్ బస్తీ సమీపంలో జీహెచ్ఎంసీ చెత్తకుండి పాయింట్ వద్ద కవర్లు కప్పుకొని నిద్రించింది శనివారం తెల్లవారు జామున చెత్త క్లియర్ చేసేందుకు రాంకీ సంస్థకు చెందిన సిబ్బంది చెత్త టిప్పర్, జేసీబీతో వచ్చారు. రేఖ అక్కడ ఉందన్న విషయాన్ని గమనించకుండానే జేసీబీతో చెత్తను తొలగించే క్రమంలో ఆ వాహనం ఆమె తలకు బలంగా తాకడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ విషయాన్ని రాంకీ సంస్థ సిబ్బంది పోలీసులకు చెప్పకుండా అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని 108 సిబ్బందికి సమాచారం ఇవ్వగా, అక్కడికి వచ్చిన వైద్య సిబ్బంది రేఖను పరీక్షించగా అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా రాంకీ సంస్థ సిబ్బంది, రేఖ మృతికి కారణమని గుర్తించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా జరిగిన విషయాన్ని తెలిపారు. మృతురాలు రేఖ కుమార్తె సోని ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీ వాణి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.