SP Venkatesh | భారతీయ సినీ సంగీత రంగంలో మరో దిగ్గజం అస్తమించింది. తన మధురమైన స్వరాలతో దశాబ్దాల పాటు సంగీతాభిమానులను అలరించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ వెంకటేశ్ (70) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. రేపు చెన్నైలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ వార్తతో సినీ పరిశ్రమలో విషాద వాతావరణం నెలకొంది.
ఎస్పీ వెంకటేశ్ సినీ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. 1971లో సాధారణ గిటారిస్ట్‌గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన, సంగీతంపై ఉన్న అపారమైన ఆసక్తి, కృషితో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎదిగారు. ప్రముఖ సంగీత దర్శకుల వద్ద సహాయకుడిగా పనిచేసి అనుభవం సంపాదించిన తరువాత స్వతంత్ర సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మలయాళ చిత్ర పరిశ్రమలో ఆయన తనదైన ముద్ర వేశారు. 1990ల దశకంలో వచ్చిన అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలకు ఆయన స్వరాలు ప్రాణం పోశాయి. ‘కిలిక్కం’, ‘ధృవం’, ‘కౌరవర్’ వంటి చిత్రాల పాటలు నేటికీ సంగీతప్రియుల మదిలో చెరగని ముద్ర వేశాయి.
తన సుదీర్ఘ కెరీర్లో ఎస్పీ వెంకటేశ్ మలయాళం, తమిళం, హిందీ, బెంగాలీ తదితర భాషల్లో 250కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు. పాటలకే పరిమితం కాకుండా ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) సినిమాలకు ప్రత్యేకమైన హైలైట్‌గా నిలిచేది. ఆయన ప్రతిభకు గుర్తింపుగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు, కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులు సహా పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు. ఎస్పీ వెంకటేశ్ మరణవార్త తెలిసిన వెంటనే మలయాళ సూపర్స్టార్లు మోహన్ లాల్, మమ్ముట్టి సహా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. “ఆయన స్వరాలు ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతాయి” అంటూ నివాళులర్పించారు.