సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ) : దోమల నివారణకు(Mosquito control) చేపట్టే యాంటీ లార్వా ఆపరేషన్, ఫాగింగ్ చర్యలపై కాలనీ వారీగా షెడ్యూల్ తయారు చేయాలని కమిషనర్ ఆమ్రపాలి(Amrapali) అధికారులను ఆదేశించారు. శుక్రవారం అడిషనల్, జోనల్ కమిషనర్లతో కమిషనర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. దోమల నివారణ చర్యలపై షెడ్యూల్డ్ తయారు చేసి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు భాగస్వామ్యం చేయాలని కమిషనర్ తెలిపారు.
షెడ్యూల్ ప్రకారంగా నెలకు నాలుగు లేదా ఐదు సార్లు కాలనీకి దోమల నివారణ చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. యాంటీ లార్వా ఆపరేషన్, ఫాగింగ్ చర్యలు ఎప్పుడు చేస్తారు? అనేది తేదీల వారీగా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులకు తెలపాలని సూచించారు. కుక్కల ఫీడింగ్‌పై ఆసక్తి గల ఎన్జీవోలు, సీఎస్ఆర్ పద్దతిలో చేపట్టేందుకు ముందుకు వచ్చిన పక్షంలో వారిలో ప్రయోగాత్మకంగా కొన్ని సర్కిల్లో చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.