Bonalu | మైలార్‌దేవ్‌పల్లి, జూలై 19: భక్తిశ్రద్ధలతో అమ్మవార్లకు బోనాలను సమర్పించి తమ మొక్కులను తీర్చుకునేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 20వ తేదీ ఆదివారం నాడు ఆషాఢ బోనాలను నిర్వహించనున్న నేపథ్యంలో ఆలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలు, మామిడి ఆకులు, వేప కొమ్మలతో తీర్చిదిద్దుతున్నారు.
జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగం ఆధ్వర్యంలో ఆలయాల పరిసరాలను శుభ్రం చేశారు. దేవాలయాల వద్ద ప్యాచ్‌వర్క్ పనులను సైతం నిర్వహించి భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో దేవాలయాల వద్ద విద్యుత్ దీపాలను అమర్చారు. ఆలయాల్లో భక్తల కోసం ఉత్సవ కమిటీలు ఏర్పాట్లను పర్యవేక్షించి భారీ ఎత్తున నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే మొక్కులు చెలించుకునేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో రానుండడంతో ఆ మేరకు ఆలయాల వద్ద సౌకర్యాలు కల్పించారు. బోనాలు తీసుకువచ్చే మహిళలు, అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, ఆలయ నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడా ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.