హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ అగ్నిపథ్‌పై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దీనిపై స్పందించారు. శనివారం ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన కేంద్రంలోని అధికార బీజేపీపై మండిపడ్డారు. ప్రధాని మోదీ తప్పుడు నిర్ణయం వల్ల యువకులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు ఎంత మంది నిరసనకారుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చుతారు? అని ప్రశ్నించారు. యువతను నాశనం చేసే స్కీమ్ అగ్నిపథ్ అని ఆరోపించారు.
కాగా, బీజేపీ నుంచి సస్పెండైన నుపుర్ శర్మ, మహద్మ్ ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో యూపీలో నిరసనలు చేసిన వారి ఇళ్లను కూల్చివేయడాన్ని అసదుద్దీన్ ఒవైసీ తప్పుపట్టారు. నిరసనలకు దిగిన యువకులు మీ పిల్లల వంటి వారు కాదా? అని వారణాసి పోలీస్ అధికారిని ప్రశ్నించారు. ముస్లింలైన తాము కూడా ఈ దేశ పిల్లలమేనని అన్నారు. ఏదైనా తప్పు జరిగితే మాట్లాడి కౌన్సిలింగ్ ఇవ్వవచ్చని సూచించారు.
జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత అఫ్రీన్ ఫాతిమా తండ్రి జావేద్ మహమ్మద్ నిరసనల్లో పాల్గొన్నందుకు ఆయనను మాత్రమే కోర్టు శిక్షించవచ్చని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అయితే ఆయన భార్య, కుమార్తెను కూడా శిక్షించడం సరికాదన్న ఆయన వారి ఇంటిని కూల్చివేయడాన్ని తప్పుపట్టారు. ఇదేనా మీ న్యాయం? అని నిలదీశారు.
ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండైన నుపుర్ శర్మను త్వరలో పెద్ద నాయకురాలిని చేస్తారని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఢిల్లీ సీఎం అభ్యర్థిగా బీజేపీ ఆమెను ప్రకటించే అవకాశం కూడా ఉందన్నారు. ‘ముస్లింలను ఎంత పెద్దగా విమర్శిస్తే, అంత పెద్ద పోస్ట్ వస్తుంది. ఇది మన జాతి వాస్తవికత’ అని అన్నారు. రాజ్యాంగం, చట్టం ప్రకారం నుపుర్ శర్మను అరెస్ట్ చేసి ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.