అంబర్‌పేట, ఫిబ్రవరి 21: తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నాల్గవ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026లో అంబర్‌పేట పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ క్రీడాకారులు పతకాల పంట పండించారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో అంబర్‌పేట పీటీసీకి చెందిన ఇద్దరు బాహుబలులు తమ అసాధారణ క్రీడా నైపుణ్యంతో ఏకంగా 9 పతకాలను కైవసం చేసుకొని రాష్ట్ర స్థాయిలోనే అంబర్‌పేట పీటీసీ పేరును మోరుమోగించారు.
మార్షల్ ఆర్ట్స్‌లో ..
హెడ్‌కానిస్టేబుల్ పరశురామ్(హెచ్‌సీ-922) తన అనుభవాన్ని, వేగాన్ని ప్రదర్శించి ‘పెంచక్ సిలట్’ విభాగంలో తిరుగులేని విజేతగా నిలిచారు. తండింగ్ పోటీలో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ బంగారు పతకాన్ని సాధించి అగ్రస్థానం లో నిలిచారు. డబుల్స్ క్రియేషన్స్‌లో రజతం సాధించారు.
మల్టీ-టాలెంటెడ్ స్టార్ శ్రీను పతకాల ప్రవాహం
పోలీస్ కానిస్టేబుల్ శ్రీను(పీసీ-2970) క్రీడల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ స్థాయి ప్రదర్శన ఇచ్చారు. కేవలం ఒక క్రీడకే పరిమితం కాకుండా వివిధ విభాగాల్లో ఏకంగా ఏడు పతకాలు సాధించి అందరిని ఆశ్చర్యపరిచారు. పెంచక్ సిలట్ విభాగం తండింగ్ ఫైట్‌లో మెరుపులు మెరిపించి బంగారు పతకం గెలుచుకున్నారు. సోలో క్రియేషన్స్, డబుల్స్, సింగిల్స్ విభాగాల్లో పోరాడి మూడుకాంస్యపతకాలనుతనఖాతాలో వేసుకున్నారు.
వుషులో….
మార్షల్ ఆర్ట్స్ విభాగమైన వుషులో తన పంజా విసిరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. తన శక్తిసామర్థ్యాలను ప్రదర్శించి త్వైకాండో, ఆర్మ్ రెజ్లింగ్(కుస్తీ/చేయిపట్లు) పోటీల్లో రెండు కాంస్య పతకాలను సాధించారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో అంబర్‌పేట పీటీసీ గౌరవాన్ని పెంచిన పరశురామ్, శ్రీనులను అంబర్‌పేట పీటీసీ ఉన్నతాధికారులు, తోటి సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. కఠినమైన విధి నిర్వహణలో ఉంటూనే క్రీడల్లో ఇన్ని పతకాలు సాధించడం అసాధారణమైన విషయం. ఇది అంబర్‌పేట పీటీసీ కి గర్వకారణం.