సికింద్రాబాద్, అక్టోబర్ 19 : కంటోన్మెంట్ల పరిధిలో ఏ-1 సహా అన్ని రోడ్ల మూసివేతకు సంబంధించి 2018 సెప్టెంబర్ 4న కేంద్ర రక్షణ శాఖ వెలువరించిన ఉత్తర్వుల్లో వెలువరించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ని తాము స్వాగతిస్తున్నామని ఫెడరేషన్ నార్త్ ఈస్ట్ కాలనీ ఆఫ్ సికింద్రాబాద్ గ్రీన్ సైనిక్‌పురి సెక్రటరీ సీఎస్ చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు ఆర్మీ రోడ్లకు సంబంధించిన ఉత్తర్వులు సీ కేటగిరి రోడ్లకు మాత్రమే వర్తిస్తాయని, ఏ-1 రోడ్లకు వర్తించవంటూ చెప్పిన అవాస్తవాలను కొట్టిపారేసినట్లు అయిందన్నారు. కంటోన్మెంట్ చట్టం ప్రకారం ఏ-1 రోడ్లను సైతం వీధులుగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. ఏ-1 రోడ్లను మిలటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ నిర్వహిస్తూ ఉండగా, సీ కేటగిరీ రోడ్లను కంటోన్మెంట్ నిర్వహిస్తోందన్నారు. కంటోన్మెంట్ లాండ్ అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ -1937లోనూ ప్రజలు వినియోగించే రోడ్లను మాత్రమే ఏ-1 రోడ్లుగా పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్లు గుర్తు చేశారు. కంటోన్మెంట్ చట్టం సెక్షన్ 258 ప్రకారం కంటోన్మెంట్‌లోని రోడ్లను శాశ్వతంగా మూసేసే హక్కు బోర్డుకు మాత్రమే ఉంటుందని, లోకల్ మిలటరీ అథారిటీస్‌కు కాదని తెలిపారు. 2018 సెప్టెంబర్ ఉత్తర్వుల మేరకు బోర్డు సైతం ఎస్ఓపీని అనుసరించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే పలు కంటోన్మెంట్లో ఈ ఉత్తర్వులను పాటించడం లేదన్నారు. ఇప్పటికైనా రక్షణ శాఖ అధికారులు మూసేసిన రోడ్లను తెరిపించాలని డిమాండ్ చేశారు.
మూసేసిన రోడ్లకు ప్రజాభిప్రాయమా..?
నిత్యం ప్రజలు వినియోగించే రోడ్లను మినహాయించి మిగతా రోడ్లను మూసివేయాలని నాలుగేండ్ల క్రితమే కేంద్ర రక్షణ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. కానీ రక్షణ శాఖ ఉత్తర్వులను లోకల్ మిలటరీ అథారిటీ అధికారులు పెడచెవిన పెట్టి నాటి నుంచి నేటి వరకు అమ్ముగూడ, బ్యామ్ రోడ్, ఆల్బెయిన్, ఎంప్రెస్ రోడ్, ప్యాట్నీ రోడ్, రిచర్డ్సన్ రోడ్లను మూసివేసే ఉన్నాయి. 2018లో రోడ్లను మూసివేసే సమయంలోనే నిబంధనల ప్రకారం ప్రజాభిప్రాయం తీసుకోవాల్సి ఉండగా, దానికి విరుద్ధంగా రోడ్లను మూసి వేశారు. నాలుగేండ్ల తరువాత స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పేరిట ప్రస్తుతం ప్రజాభిప్రాయం చెప్పాలంటూ కంటోన్మెంట్ బోర్డు ప్రకటనలు ఇవ్వడం శోచనీయం. ఇలాంటి చర్యలకు దిగడం, ప్రజల హక్కులను కాలరాయడమే.
– జక్కుల మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు, కంటోన్మెంట్ బోర్డు