Numaish | అబిడ్స్, డిసెంబర్ 29: హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏటా జనవరి 1 నుంచి మొదలయ్యే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) ఈసారి కాస్త ఆలస్యంగా ప్రారంభం కానున్నది. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ మరణం నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 3 నుంచి నుమాయిష్ మొదలవుతుందని, సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఎగ్జిబిషన్ సొసైటీ కోశాధికారి డాక్టర్ బి. ప్రభాశంకర్ వెల్లడించారు.
ఎగ్జిబిషన్ మైదానంలోని గాంధీ సెంటినరీ హాల్లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈసారి ప్రవేశ రుసుమును రూ.40 నుంచి రూ.50కి పెంచామని, సీనియర్ సిటిజన్ల కోసం వీల్చైర్లను అందుబాటులో ఉంచుతున్నామని, జనవరి 7న ఎగ్జిబిషన్లో మహిళలకు మాత్రమే ప్రవేశం కల్పిస్తామని వివరించారు. సందర్శకులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించనున్నామని, అందులో భాగంగా 100 సీసీ కెమెరాలను, వాచ్ టవర్లను ఏర్పాటు చేశామని చెప్పారు.
అగ్ని ప్రమాదాల నివారణ కోసం మైదానమంతటా వాటర్ పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయడంతోపాటు 2 ఫైరింజన్లను అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. సందర్శకుల సౌకర్యార్థం ఈసారి ఎగ్జిబిషన్లో మినీ ట్రైయిన్తోపాటు కొత్తగా అద్దాలతో కూడిన డబుల్ డెక్కర్ బస్సును అందుబాటులోకి తీసుకొస్తున్నామని, దీని టికెట్ ధరను రూ.40గా, మినీ ట్రైయిన్ టికెట్ ధరను రూ.30గా నిర్ణయించామని చెప్పారు. సమావేశంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్, కార్యదర్శి సురేందర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి మోహన్, పబ్లిసిటీ కన్వీనర్లు సురేశ్ కుమార్, డాక్టర్ సురేశ్‌రాజ్, తదితరులు పాల్గొన్నారు.