Amberpet | గోల్నాక, ఏప్రిల్ 26: వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి వెళ్లేందుకు అంబర్ పేట నియోజకవర్గం నుంచి గులాబీ దండు సర్వం సిద్ధమైంది. ఆదివారం నియోజకవర్గం నుంచి కనీసం 4 వేల మందికి పైగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను తరలివెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మేరకు పార్టీ నాయకులు వాహనాలు, భోజన ఇతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే అంబర్ పేట నియోజకర్గంలోని ప్రధాన ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లతో గులాబీమయంగా మారిపోయింది. దీంతో ఒక్క రోజు ముందే గులాబీ రెపరెపలతో బీఆర్ఎస్ జెండా మురిసింది. ఈ క్రమంలోనే శనివారం అంబర్ పేట అలీ కేఫ్ చౌరస్తా వద్ద ఘనంగా గులాబీ జెండా పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వందలాది మంది బీఆర్ఎస్ నాయకులతో కలసి హాజరైన ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ..ముందుగా అక్కడ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూల మాల వూసి నివాళుర్పించారు. అనంతరం బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించి భారీ కేక్ కట్ చేసి బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ.. ఆదివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రజతోత్సవ భారీ బహిరంగ సభకు ఎవరెవరు ఎక్కడున్నా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అంబర్‌పేట గులాబీ దండు బలమెంతో చూపుతూ దారులన్ని ఎల్కతుర్తి వైపే సాగాలని ఆయన పిలుపునిచ్చారు. అది చూసి కాంగ్రెస్ దిమ్మతిరిగి పోవాలన్నారు. 25 ఏండ్లు తెలంగాణ హక్కులు, సమస్యలపైనే పోరాటం సాగించి సాధించుకున్న తెలంగాణలో అన్ని వనరులు, వసతులు ఏర్పాటు చేసుకున్నామని ఆయన గుర్తు చేశారు. గత పదేండ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని, అభివృద్ధి, సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసి అన్ని వర్గాలకు అందించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎల్కతుర్తి రజతోత్సవ సభ వైపు యావత్ దేశం ఎదురు చూస్తోందని అన్నారు.
మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి సర్కార్‌పై ప్రజలకు నమ్మకం పోయిందని కాలేరు వెంకటేశ్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనను చూసి తాము మోసపోయామని ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన అనేక పథకాలు తమకు అందడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. కేసీఆర్ నాయకత్వాన్ని సబ్బండవర్గాలు కోరుకుంటున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూసి మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ పాలనే కావాలంటున్నారని ఆయన అన్నారు. గత బీఆర్ఎస్ పాలనను, నేటి కాంగ్రెస్ పాలనను చూసి అర్థం చేసుకున్న ప్రజలు కేసీఆర్‌ను చూసేందుకు స్వచ్ఛందంగా సభకు తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రం తెచ్చిన నేతగా, పదేండ్లు అభివృద్ధి చేసిన నాయకుడిగా కేసీఆర్ మాటలు వినేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారని పేర్కొన్నారు. పదేండ్ల అనతికాలంలోనే తెలంగాణలో అద్భుతమైన ప్రగతిని సాధించుకున్నామని ఆయన గుర్తు చేశారు. గతంలో కంటే రెట్టింపు మద్దతుతో అధికారం వచ్చే రోజు త్వరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అంబర్ పేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి కలిసికట్టుగా రావాలన్నారు.అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.