Garwa | మణికొండ, మార్చి 30 : ప్రజల సమస్యల పరిష్కారం కోసం గ్రేటర్ అల్కాపురి రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (గర్వ) ప్రారంభించామని అసోసియేషన్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మణికొండ మునిసిపాలిటీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ అసోసియేషన్లో చేరవచ్చని స్వాగతించారు. ప్రతి కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సత్వరమే పరిష్కరించడానికి తమ అసోసియేషన్ కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
ఉగాది పర్వదినాన్ని శుభసూచకంగా భావించి గర్వ అసోసియేషన్ను ప్రారంభించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అసోసియేషన్ ప్రారంభించిన తొలిరోజే 750 మంది సభ్యులు చేరడం సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా అత్యధికంగా మణికొండ మునిసిపాలిటీలో ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారని ఆయన అవేదన వ్యక్తం చేశారు. అల్కాపురి కాలనీలో తీవ్ర నీటి ఎద్దడి ఉందని.. చుట్టుపక్కల వాళ్లు భూగర్భ జలాలను తోడేస్తుండటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. నీటి సమస్య పరిష్కారం కోసం తొందరలోనే జలమండలి ఎండీ అశోక్ రెడ్డిని కలుస్తామని పేర్కొన్నారు.
అన్ని నిబంధనల ప్రకారమే గర్వ(GARWA)ను రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆల్కపూర్ కాలనీలో మొదటిసారిగా అసోసియేషన్ సభ్యులు సమావేశమయ్యారు. కమ్యూనిటీ వెల్ఫేర్ కోసం కృషి చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే ఎంతోమంది ఆల్కాపూర్ నుంచి తమ అసోసియేషన్ లో చేరినట్లు తెలియజేశారు. ఇక్కడి ప్రజలు దోమలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక చిన్న చెరువులో గుర్రపుడెక్క బాగా పెరిగిందని, అధికారులు వెంటనే దానిని తొలగిస్తే దోమల బెడద తప్పుతుందన్నారు. ఇక్కడ ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగా పెరిగిందని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా గర్వ అసోసియేషన్ సభ్యులు ప్రకటించారు. అల్కాపూర్ కాలనీలో భూకబ్జాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
అనంతరం గర్వ జనరల్ సెక్రెటరీ వినయ్ కుమార్ తణుకురి మాట్లాడుతూ.. 15, 20 ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నామని ఎన్నో సమస్యలను గుర్తించామని వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. త్వరలో వెబ్సైట్ ప్రారంభిస్తామని, ప్రజలు తమ సమస్యలను అందులో ప్రస్తావిస్తే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సామాన్యులకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పని చేస్తామని తెలిపారు.