సిటీబ్యూరో/బేగంపేట్, మే 31 (నమస్తే తెలంగాణ) : బేగంపేట్ రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం కదిలిన రైలును ఎక్కే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు రైలు కింద పడిపోతున్న ఒక మహిళా ప్రయాణికురాలిని అక్కడే విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుమారి సునీత పరుగెత్తి పట్టుకుని ప్రాణాలు కాపాడింది. లింగంపల్లి- ఫలక్‌నుమాకు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఉదయం 9 గంటలకు బేగంపేట్‌లో ఆగింది. తిరిగి బయలు దేరిన రైలులోకి ఎక్కడానికి మహిళా ప్రయాణికురాలు సరస్వతి ప్రయత్నించింది. రైలు వేగం పెరగడంతో అదుపు తప్పింది. ప్లాట్ఫారం- రైలు మధ్యలో పడిపోయే అవకాశం ఉండటంతో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆమెను గమనించి వెంటనే పట్టుకుని ప్లాట్ఫారం పైకి తీసుకువచ్చింది. ‘మిషన్ జీవన్ రక్ష’ పథకంలో భాగంగా ఆర్పీఎఫ్ ఈ మేరకు ప్రాణ రక్షణ చర్యలు తీసుకోవడంతో దక్షిణ మధ్య రైల్వే జోనల్ జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్, ఇతర రైల్వే అధికారులు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సునీతను ప్రత్యేకంగా అభినందించారు. ఆమె ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. ఈ కానిస్టేబుల్ ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.