ఉస్మానియా యూనివర్సిటీ: దేశంలోని అన్ని యూనివర్సిటీలలో నెలకొని ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అఖిల భారత విశ్వవిద్యాలయ ఉద్యోగుల సమాఖ్య (ఏఐయూఈసీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు సమాఖ్య ప్రతినిధులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి సమస్యలను వివరించారు. దీర్ఘకాలికంగా తమ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. విశ్వవిద్యాలయాల ఉద్యోగులకు పాత పెన్షన్‌ను అమలు చేయాలని కోరారు.
యూనివర్సిటీల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (పాలకమండలి)లో బోధనేతర ఉద్యోగులకు ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని యూనివర్సిటీలలో ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నుంచి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐయూఈసీ అధ్యక్షుడు భవానీ శంకర్ హోత, కార్యనిర్వాహక అధ్యక్షుడు సజ్జన్, కోశాధికారి అబ్దుల్ ఖదీర్‌ఖాన్, అన్ని యూనివర్సిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.