సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ): రోడ్లపై ట్రాఫిక్ ఎలా ఉంటే మాకేంటీ?..ఫొటోలు కొట్టాలి.. ఆదాయాన్ని పెంచాలి.. ఖజానా నింపే ధోరణితో ప్రజాపాలనలో ట్రాఫిక్ నియంత్రణను ట్రాఫిక్ పోలీసులు గాలికొదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్లు.. ఫుట్‌పాత్ ఆక్రమణలు.. రోడ్లపై పాదచారులు నడిచేందుకు వీలు లేని పరిస్థితి. హెల్మెట్ లేకుండా ప్రయాణాలు, సిగ్నల్ జంపింగ్, రాంగ్‌రూట్ డ్రైవింగ్ ఇలా ఎన్నో ట్రాఫిక్ ఉల్లంఘనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆపరేషన్ రోప్(రిమూవల్ ఆబ్స్ట్రాక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్మెంట్) అటకెక్కింది. 2023 జనవరి 1 నుంచి మే, 27, 2023, 2024 జనవరి 1 నుంచి మే, 27 ఐదు నెలల సమయానికి 55 రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలు పోలిస్తే 27.16 శాతం పెరిగాయి. ట్రాఫిక్ ఇబ్బంది కల్గించేవి, రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే ప్రధానమైన ఉల్లంఘనలో రోడ్లపై ఎక్కడి పడితే అక్కడ పార్కింగ్ చేస్తున్న కేసులు 98 శాతం పెరుగగా, పాదచారులను ఇబ్బందులు పెట్టే కేసులు 258 శాతం, సైలెన్సర్స్తో సౌండ్ పొల్యూషన్ కేసులు 400 శాతం పెరిగాయి. కేవలం ట్రాఫిక్ పోలీసులు ఫొటోలు కొట్టి చలాన్లు వేయడమే తమ విధులు అన్నట్లుగా పనిచేస్తున్నారు. దీంతో నగరంలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తమవుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఓ వైపు ప్రజల్లో అవగాహన పెంచుతూ, మరో వైపు ఉల్లంఘనదారులపై చలాన్లు వేసే వారు. ఇప్పుడు అవగాహన కార్యక్రమాలు లేవు, పట్టించుకునే నాధుడు లేడు. అయితే ఇప్పుడు చాలా వరకు నాన్ కాంటాక్టు పద్ధతిలోనే చలానాలు వేస్తున్నారు.
ఆరు నెలలుగా ట్రాఫిక్ వ్యవస్థను గాడిలో పెట్టలేని పరిస్థితి. ట్రాఫిక్‌లో పనిచేసే పోలీసులు ఉన్నతాధికారులు ఎప్పుడో ఓ సారి హడావిడి చేయగానే రోడ్లపై కన్పిస్తుంటారు. ఆ తరువాత అడిగేవారే ఉండరు. కాని ప్రతి రోజు ఆయా పోలీస్స్టేషన్ల నుంచి ఎన్ని ఉల్లంఘన కేసులు నమోదయ్యాయనే విషయంపై ఉదయం అధికారులకు లిస్ట్ వెళ్తుంది. అలా చలాన్లు పెరుగుతుండటంతో కొందరు అధికారులు అంతకే సంతృప్తి చెందుతున్నారా? ఎందుకు ఉల్లంఘనలు పెరుగుతున్నాయి? అనే విషయంపై ఆరా తీస్తున్నారా? అనే విషయాలపై అధికారులు సమాలోచన చేయాల్సిన అవసరముంది. చలాన్లు వేయడమే పరమావధిగా నేడు పోలీసులు పనిచేస్తున్నారు.. కేవలం ఐదు నెలల సమయంలో 27 శాతం ఉల్లంఘనలు పెరిగాయంటే, ట్రాఫిక్ నియంత్రణను గాలికి వదిలేశారు. గత ఆరు నెలల క్రితం వరకు ఆపరేషన్ రోప్ కొనసాగింది. ట్రాఫిక్ విభాగంతో సామాన్య ప్రజలకు 100 శాతం సంబంధముంటుంది, ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది కల్గకుండా సాఫీగా ప్రయాణం సాగేలా చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టి జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, విద్యుత్, వాటర్‌వర్క్స్ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పనిచేశారు. ఒక పక్క అవగాహన తెచ్చి మరో పక్క ఉల్లంఘనదారులపై చర్యలు తీసుకుంటూ మంచి ఫలితాలు సాధించారు. అయితే ఇప్పుడు ఆ విషయంపై పట్టించుకునే వారు లేరు. నగర ట్రాఫిక్ విభాగంలో పనిచేసే బాస్‌లు తరుచు మారుతుండటం కూడా ఒక సమస్యగా మారిందనే వాదన విన్పిస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది.