హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌పై ఆ పార్టీ అధిష్టానం కఠిన చర్యలు తీసుకున్నది. ఆయనను పార్టీ నుంచి తక్షణమే బహిషరిస్తున్నట్టు ప్రకటించింది. ఎమ్మెల్సీ పదవికి కూడా వెంటనే రాజీనామా చేసి, ఆ లేఖను శాసనమండలి చైర్మన్‌కు సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ఎంఐఎం సంయుక్త కార్యదర్శి ఎస్ఏ హుస్సేన్ అన్వర్ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే రహ్మత్ బేగ్‌పై చర్యలకు దారితీసిన పూర్తి కారణాలను పార్టీ తన ప్రకటనలో వెల్లడించలేదు. మీర్జా రహ్మత్ బేగ్ 2023లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2029 మే వరకు కొనసాగాల్సి ఉన్నది.
అయితే పార్టీ తాజాగా నిర్ణయంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ ఆదేశాల మేరకు రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్‌కు సమర్పించిన తర్వాతే ఆయన ఎమ్మెల్సీ పదవిపై తదుపరి ప్రక్రియ ప్రారంభం కానున్నది. అయితే, రాజీనామా చేసేందుకు రహ్మత్ బేగ్ ససేమిరా అంటున్నట్టు తెలుస్తున్నది. ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియో లీక్ వ్యవహారమే రహ్మత్ బేగ్‌పై పార్టీ చర్యలకు కారణమని ప్రచారం జరుగుతున్నది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివిధ ఆరోపణలకు ఇప్పటివరకు అధికారిక ధ్రువీకరణ లేదు. ఈ నేపథ్యంలో పార్టీ అకస్మాత్తుగా బహిషరణ వేటు వేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నది.
మరోవైపు, ఇటీవల తనపై డీప్ ఫేక్, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు బయటపెడతామంటూ కొందరు డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరిస్తున్నారని రహ్మత్ బేగ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు వార్తలు వచ్చాయి. రహ్మత్ బేగ్ వ్యవహారంలో సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు, వైరల్ అవుతున్న వీడియోలు, ఆయన గతంలో చేసిన సైబర్ క్రైమ్ ఫిర్యాదు.. ఈ పరిణామాల మధ్య ఎంఐఎం అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే బహిషరణకు కచ్చితమైన కారణాన్ని పార్టీ అధికారికంగా వెల్లడించకపోవడంతో ఈ వ్యవహారంపై స్పష్టత రావాలంటే ఎంఐఎం నుంచి మరింత వివరణ రావాల్సి ఉన్నది. అదే సమయంలో వైరల్ అవుతున్న వీడియోలు, వాటికి సంబంధించిన ఆరోపణల నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉన్నది.