సుల్తాన్‌బజార్, జూన్ 6 : అనధికార కార్పోరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవడంలో ఇంటర్ బోర్డు పూర్తిగా విఫలమైందని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర అన్నారు. గురువారం నాంపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యాలయం ఎదుట అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో గత 15 రోజులుగా అనధికార కళాశాలల్లో అడ్మిషన్లు, తరగతులు నిర్వహిస్తున్న అంశాలపై చేపట్టిన సర్వే నివేదికను ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజాకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వందలాది ఇంటర్ బోర్డు గుర్తింపు పొందని కళాశాలలు ఉన్నాయని, అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రధానంగా మూడు జిల్లాల్లో 200కు పైగా జూనియర్ కళాశాలలు ఇంటర్ బోర్డుకు విరుద్ధంగా నడుస్తున్నాయని ఆరోపించారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే కార్పొరేట్ కళాశాలల ఆగడాలను కట్టడిచేయాలని కోరారు. ఏఐవైఎఫ్ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై సమగ్ర విచారణ చేపడుతామని నిర్లక్ష్యం కనబర్చిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, ఉపాధ్యక్షులు టి.సత్యప్రసాద్, శ్రీమాన్, రాష్ట్ర సమితి సభ్యులు షేక్ మహమూద్, మాజిద్, శేఖర్, కళ్యాణ్, విజయ్, బాలు, మహేశ్, శ్రీకాంత్, జోసెఫ్, తదితరులు పాల్గొన్నారు.