ఇప్పుడు ఏ సూచన కావాలన్నా.. ఏ విషయం తెలుసుకోవాలన్నా.. ఏఐనే ఫాలో అవుతున్నారు జనం..అయితే ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆరోగ్యం విషయంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌ను నమ్ముకోవడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. కొందరు చాట్‌జీపీటీలో ఏ రోగానికి ఏ మాత్రలు వాడలో వెతుకుతూ.. అధిక డోసులు కలిగిన మందులు వాడేసి.. కొత్తరోగాలను కొనితెచ్చుకుంటున్నారు. చివరికి రోగం ముదిరి ప్రాణాల మీదకి రాగానే ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. సొంత వైద్యం ప్రమాదకరమో..‘ఏఐ వైద్యం’ మరింత ఇబ్బందులను కొనితెచ్చిపెడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
-సిటీబ్యూరో, మే 10, (నమస్తే తెలంగాణ)
హైదరాబాద్ కు చెందిన 35 ఏండ్ల కుమార్ ఒళ్లు నొప్పులతో బాధపడుతూ నొప్పులు తగ్గేందుకు మాత్రల కోసం గూగుల్‌ను ఆశ్రయించాడు. వాటిని వేసుకున్న తరువాత కూడా నొప్పులు తగ్గకపోగా జ్వరం వచ్చింది. తీవ్ర జ్వరం, నొప్పులతో వారం రోజుల తరువాత ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి సరైన చికిత్సనందిస్తే కాస్త కోలుకున్నాడు.
రంగారెడ్డికి చెందిన ఓ గృహిణి ఇంట్లో పనులు చేస్తూ కాలు జారి పడటంతో యూట్యూబ్‌లో చూసి సెల్ఫ్ మెడికేషన్ వాడటం మొదలు పెట్టింది. నాలుగు రోజుల తరువాత కూడా నొప్పి తగ్గకుండా కాలు వాపు రావడంతో భయపడి వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. నెలరోజుల పాటు చికిత్సనందించి ఆమె ఆరోగ్యం కుదుటపడేలా చేశారు. దాంతో పాటు బిల్లు కూడా అధిక మొత్తంలో వేశారు. గాయమైన మొదట్లోనే వైద్యున్ని సంప్రదించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు.
సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత సమాజంలో ప్రజలు ప్రతి పనికి ఇంటర్నెట్ మీద ఆధారపడుతున్నారు. ఆఖరికి ఆరోగ్యం విషయంలో కూడా సామాజిక మాధ్యమాలను ఆశ్రయిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్(ఏఐ) తాలుకా చాట్‌జీపీటీలో ఏ రోగానికి ఏ మాత్రలు వాడాలో వెతుకుతున్నారు. అధిక డోసులు కలిగిన మందులు వాడుతూ రోగాలపాలవుతున్నారు.
ఉదాహరణకు అలెర్జీ ఉన్నవారికి గూగూల్ చెప్పిన మందులు వాడటం వల్ల శరీరంలో తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు ఏర్పడి రోగం ముదురుతుంది. సెల్ఫ్ మెడికేషన్ కేసులకు గ్రేటర్ హైదరాబాద్ నిలయంగా మారింది. ఈ తరహా వాడకం వల్ల రోగాలు ముదిరి చివరి దశలో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్లల్లో నిత్యం ఉండే ఓపీ సేవల్లో సగానికి పైగా కేసులు ఇలాంటి తరహాలోనే ఉంటున్నాయి. ఇందులో ప్రధానంగా నడివయస్సు వారే అధికంగా ఉండటం గమనార్హం.
చిన్నరోగానికే వైద్యుని వద్దకు వెళితే డబ్బులు ఖర్చు అవుతాయని చాలా మంది భావన. అందుకే ఆసుపత్రికి వెళ్లకుండా ఇంటర్నెట్, మెడికల్ దుకాణాలు, ఇరుగుపొరుగు వారి సలహాలతో కావాల్సిన మందులు కొని వాడుతున్నారు. జ్వరం రావడంతోనే ఆలస్యం చేయకుండా మాత్రలు వేసుకుని, తాత్కాలికంగా ఉపశమనం పొందుతున్నారు. నాలుగు రోజుల వరకు అది తగ్గకుండా పరిస్థితి విషమిస్తే గాని ఆసుపత్రిలో చేరడంలేదు. సీజనల్ వ్యాధుల విషయంలోనూ ఇదే తంతు.
జలుబు, దగ్గు సమయాల్లో వైద్యున్ని సంప్రదించకుండానే సొంత వైద్యం చేసుకుంటున్నారు. మలేరియా, డెంగీ లక్షణాలు ఉన్నా.. తేలిగ్గా తీసుకోవడం, రోగం ముదిరిన తరువాత ఆసుపత్రిలో చేరడం అలవాటుగా మారింది. వైద్య పరీక్షల్లో రోగం తీవ్రత తెలిసి బెంబేలెత్తిపోతున్నారు. మొదటి రోజు ఆసుపత్రికి వెళ్లకుండా వారం తరువాత వెళ్లడం కారణంగా వైద్యం అందించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు మరణించిన దాఖలాలు కూడా ఉన్నాయి. గూగుల్, చాట్ జీపీటీల వాడకం వల్ల నిండు ప్రాణాలు పోయే ప్రమాదం పొంచి ఉంది.
వైద్యులను సంప్రదించండి
-డాక్టర్ శశిధర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నిమ్స్ ఆసుపత్రి
ఏఐ డయాగ్నోసిస్‌లో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేతప్ప అదే వైద్యం చేయదు. కేవలం వైద్యుల సూచనల ప్రకారం మాత్రమే పని చేసే సాధనం. శస్త్ర చికిత్సలు కూడా వైద్యుడే చేయాలి. బద్ధకం, ఆసుపత్రికి వెళితే డబ్బులు ఖర్చవుతాయనే కారణంగా చాలా మంది ఆన్లైన్ వైద్యం చేసుకుంటున్నారు. రోగం మొదట్లోనే వైద్యున్ని సంప్రదించకపోవడం వల్ల చివరికి రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తున్నది.