రవీంద్రభారతి, ఏప్రిల్ 6 : సమాజాన్ని ప్రశ్నించేది నాటకమని, వాటిని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. రాష్ట్ర సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో యవనిక 2023 పేరిట నాటకోత్సవాలు రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేవీ రమణాచారి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి నాటకోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను నాటక రంగ అభిమాని అని స్వయంగా నాటకం వేసి రసరంజని ద్వారా నాటకాలను ప్రోత్సహించానని పేర్కొన్నారు. యువ నాటకోత్సవాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదన్నారు. మొదటి రోజు రామప్ప నాటకం ప్రదర్శించడం అభినందనీయమని, ప్రపంచ వ్యాప్తంగా రామప్ప దేవాలయం గుర్తింపు పొందిందని తెలిపారు. తెలంగాణ సంగీత నాటక అకాడమి చైర్మన్ దీపికారెడ్డి మాట్లాడుతూ నాటకాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మూడు రోజుల పాటు యువనిక పేరిట నాటకోత్సవాలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫిలిం, టెలివిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనీల్ కుర్మాచలం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డా.మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. సభకు ముందు డా.కోట్ల హనుమంతరావు దర్శకత్వంలో రామప్ప నాటకం , మంచాల రమేశ్ దర్శకత్వంలో చీకటి పువ్వు ప్రదర్శించిన నాటకాలు ఆకట్టుకున్నాయి.