సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): నగరంలో కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠా గుట్టును సికింద్రాబాద్ డీటీఎఫ్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున కల్తీ మద్యంతో పాటు ఖరీదైన ఖాళీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ డీటీఎఫ్ ఇన్స్పెక్టర్ సావిత్రి సౌజన్య కథనం ప్రకారం…ఒరిస్సా ప్రాంతానికి చెందిన పప్పు నగరంలోని మాదాపూర్, సాయినగర్‌లో గదిని అద్దెకు తీసుకుని ఖరీదైన మద్యం సీసాల్లో తక్కువ ధర గల మద్యం నింపి, ఎంఆర్పీ ధర కంటే తక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో నిందితుడు ఈవెంట్లకు వెళ్లి అక్కడి నుంచి ఖరీదైన ఖాళీ మద్యం సీసాలను సేకరిస్తాడు.
అనంతరం వాటిని శుభ్రం చేసి, వాటిలో 75శాతం వరకు ఐకానిక్ వైట్ వంటి తక్కువ ధర గల మద్యాన్ని నింపుతాడు. మిగిలిన 25శాతం మాత్రం ఒరిజినల్ బ్రాండ్ మద్యాన్ని నింపి ఏ మాత్రం అనుమానం రాకుండా బాటిల్‌కు క్యాపింగ్ చేస్తాడు. ఈ విధంగా తయారు చేసిన మద్యంను తన అనుచరులైన చికున్ స్వాన్, సోను మహంతుల ద్వారా ఈవెంట్లు, పార్టీలు, విందులకు సరఫరా చేస్తాడు. చివాస్ రీగల్ ఎంఆర్పి ధర రూ.9600ఉండగా నిందితుడు మాత్రం ఆ బాటిల్‌ను కేవలం రూ.7500కే విక్రయించడంతో చాలా మంది మద్యం ప్రియులు తక్కువ ధరకే ఖరీదైన మద్యం లభిస్తుందని మోసపోతున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ మేరకు సమాచారం అందుకున్న సికింద్రాబాద్ డీటీఎఫ్ సీఐ సౌజన్య తన బృందంతో కలిసి బేగంపేట, రసూల్‌పుర మెట్రో స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు.
చికున్ స్వాన్, సోను మహంత్‌ల వద్ద 6 చివాస్ రీగల్ ప్రీమియం లికర్ బాటిళ్లు లభించాయి. వాటిని పరిశీలించగా ప్రీమియం లికర్ బాటిల్లో ఉన్న మద్యం ఒరిజినల్ కాదని అది తకువ ధర కలిగిన కల్తీ మద్యం అని తేలింది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా ప్రధాన నిందితుడైన పప్పు బండారం బయటపడింది. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు డీటీఎఫ్ పోలీసులు మాదాపూర్‌లోని సాయినగర్‌లో పప్పు అద్దెకు ఉంటున్న నివాసంపై దాడి చేయగా కల్తీ మద్యం గుట్టు మొత్తం ఈ ముఠా కేవలం చివాస్ రీగల్, రాయల్ సెల్యూంట్ వంటి అత్యంత ఖరీదైన మద్యంను మాత్రమే కల్తీ చేసి విక్రయిస్తున్నట్లు సికింద్రాబాద్ ఈఎస్ పంచాక్షరీ వెల్లడించారు. కల్తీ మద్యం తయారీ కేంద్రంలో 38 ఖరీదైన కల్తీ మద్యం ఫుల్ బాటిల్స్, 63 ఖరీదైన ఖాళీ బాటిల్స్, వాటి క్యాప్స్, మద్యంను కల్తీ చేసే యం త్రాలు, ఇతర సామాగ్రీ లభించింది. ఈ మేరకు పట్టుబడిన ఇద్దరు నిందితులను అరెస్ట చేసి, తదుపరి విచారణ నిమిత్తం సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు పప్పు కోసం గాలిస్తున్నట్లు సికింద్రాబాద్ ఈఎస్ పంచాక్షరీ, ఏఈఎస్ శ్రీనివాస్ తెలిపారు.