సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): నగర పోలీసు విభాగాన్ని మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి అందుకు అనుగుణంగా 3965 పోస్టులను భర్తీ చేసేందుకు శనివారం కేబినెట్ ఆమోదం తెలిపింది.
మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ లెవల్ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో, సైబర్ నేరాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ లెవల్ సైబర్ సేఫ్టీ బ్యూరోతో పాటు రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్లను మరింత పటిష్ట పరిచేందుకు ఈ 3 విభాగాల్లో 884 పోస్టులను కేటాయించారు. వీటితో పాటు 3 కమిషనరేట్లకు కలిపి జాయింట్ కమిషనర్ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు అదనంగా 2648 పోస్టులు ఇచ్చారు. ఇంటెలిజన్స్ విభాగంలో 105, మినిస్టీరియల్ విభాగంలో 138, ఇతర విభాగాల్లో 190 సహా మొత్తం 3965 పోస్టులను భర్తీ చేయనున్నారు.