మేడ్చల్, ఆగస్టు 25(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం అధికారులతో కలెక్టర్ హరీశ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 31 నుంచి వచ్చే నెల 31 వరకు జరిగే గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తున్నదన్నారు.
మే డ్చల్ జిల్లా వ్యాప్తంగా 17 చెరువులలో నిమజ్జనాలు జరుగనున్నట్లు, అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. వినాయకుల ను నిమజ్జనం చేసే చెరువుల వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచే విధం గా మత్స్యశాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. 17 చెరువుల వద్ద క్రేన్లను ఉంచాలని సూచించారు. పండుగను ప్రశాంత వాతావారణంలో జరుపుకోవాలన్నారు. ఈ సమీక్షలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, డీఆర్వో లింగ్యా నాయక్, బాలానగర్ డీసీపీ సందీప్, ఆర్డీవోలు మల్లయ్య, రవి మున్సిపల్ కమిషనర్లు, వివిధ మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.