కేపీహెచ్‌బీ కాలనీ (హైదరాబాద్) : కూకట్పల్లి నియోజకవర్గంలో అధికారులు ప్రోటోకాల్ (Protocol) ను ఉల్లంఘిస్తూ పబ్బం గడుపుతున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే (BRS MLA) మాధవరం కృష్ణారావు(Madhavaram Krishna Rao) ఆరోపించారు. ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ (Speaker) గడ్డం ప్రసాద్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల మద్దతుతో మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించానని, తాను ప్రజా సమస్యల పరిష్కరం కోసం పనిచేస్తుంటే, అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. ప్రభుత్వం చేపట్టే పనులు, కార్యక్రమాలలో భాగస్వామ్యం అవుతూ ముందుకు సాగుతుంటే, స్థానికంగా ప్రభుత్వ అధికారులు స్పందించడం లేదన్నారు.
ఫిర్యాదుకు స్పందించిన స్పీకర్ వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి శాసన సభ్యుల హక్కులకు భంగం కలిగించే అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారని ఆయన వెల్లడించారు. ప్రోటోకాల్ సమస్య పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.