హిమాయత్ నగర్, ఏప్రిల్2: ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ అధినేత కమలాకర్ శర్మ అధిక వడ్డీల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని ధన్వంతరి బాధితుల ఫోరం కన్వీనర్ గిరిప్రసాద్ శర్మ ఆరోపించారు. బుధవారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటర్నేషనల్ సంస్థ పేరుతో ఓ ట్రస్ట్‌ను కమలాకర్ శర్మ ఏర్పాటు చేసి కోట్ల రూపాయలను సుమారు 3 వేల మంది ప్రజల నుంచి పెట్టుబడుల రూపంలో వసూలు చేశారని తెలిపారు. రెండు దశాబ్దాలుగా ప్రజలను మోసం చేయడంతో గతంలో కమలాకర్ శర్మ జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చారని, తిరిగి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఈ విషయంపై అతనిని ప్రశ్నిస్తే మీరు కోర్టులో చూసుకోండి అంటూ పెట్టుబడిదారులను మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారని ఆయన వాపోయారు. కమలాకర్ శర్మ ఆర్థిక నేరాలకు పాల్పడిన వైనంపై సీసీఎస్ అతడి ఆకౌంట్లు సీజ్ చేశాయని, అయితే జైలు నుంచి బయటకు వచ్చిన అతను బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకుంటున్నాడని ఆరోపించారు. మోసాలకు పాల్పడుతున్న కమలాకర్ శర్మ పై కఠిన చర్యలు తీసుకో వాలని ప్రభుత్వాన్ని కోరారు.