నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూన్ 3 (నమస్తే తెలంగాణ): మాసబ్‌ట్యాంక్ పరిధిలో జరిగిన ప్రముఖ న్యాయవాది ఖాజా మెయిజుద్ధీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు టీపీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు ముజాహిద్ ఆలం ఖాన్‌ను పోలీసు కస్టడీకి అప్పగించాలని బుధవారం పోలీసులు పిటీషన్ దాఖలు చేశారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ విచారణాధికారి సైదులు నేతృత్వంలో సమాచారం సేకరించేందుకు 10 రోజు ల పాటు పోలీసు కస్టడీకి కోరుతూ 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు పిటీషన్‌ను సమర్పించారు. మే 24న ఉదయం న్యాయవాది తన ఇంటినుంచి బయటకు వ చ్చి కారు ఎక్కుతుండగా నిందితులు స్కార్పియో వాహనంతో బలంగా ఢీకొట్టి కొద్ది దూరం ఈడ్చుకెళ్లారు.
పోలీసులు ప్రాథమికంగా హిట్ అండ్ రన్ కింద కేసును భావించిన అనంతరం సీసీటీవీ ఫూటేజ్, సాంకేతిక ఆధారాల ఆధారంగా ఇది ప్రమాదం కాదని, పక్కాగా ప్లాన్ ప్రకారం హత్య అని పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. ముజాహిద్ తండ్రి మహబూబ్ ఆలం ఖాన్‌తో కలిసి ప్రణాళిక రచించారని, వీరిద్దరినీ సూత్రధారులుగా పరిగణిస్తూ రిమాండ్ రిపోర్టును రూపొందించారు. ముజాహిద్‌కు జైలులో పోలీసులు నోటీసులు జారీ చేసిన పిదప కస్టడీ పిటీషన్‌ను కోర్టు ఎదుట దాఖలు చేశారు. విచారణకు ముజాహిద్ సహకరించలేదని, విచారణ పూర్తి చేసేందుకు సమయం సరిపోలేదని పేర్కొన్నారు.
కీలక ఆధారాలను సేకరించాల్సి ఉందని, నిందితుడి ద్వారా కీలక సమాచారం నమోదు చేయాల్సి ఉందని తెలిపారు. ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించడానికి రూ.25 లక్షల సుపారీ ఇచ్చినట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. హంతకుడు కిషన్‌సింగ్ అలియాస్ పప్పు, స్టంట్ నిపుణుడు అభిజిత్ సహా మొత్తం ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ముజాహిద్‌ను కాంగ్రెస్ పార్టీనుంచి బహిష్కరించినట్టు ఆ పార్టీ ప్రకటించింది. అభిజిత్ అలియాస్ నానీ, దిఘన్ వినయ్, విక్రమ్ ఆదిత్య అలియాస్ చింటూ, మణిదీప్ అలియాస్ పోగో నానీ, కిషన్ సింగ్ అలియాస్ పప్పులు రిమాండ్ ఖైదీలుగాచంచల్గూడా జైలులో ఉన్నారు.