
పూడూరు, జూలై 26 : ఎవరిదో అతివేగం.. మరెవరి కుటుంబాన్నో బలి తీసుకుంది. ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటన వికారాబాద్ జిల్లా చన్గోముల్ పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్సై శ్రీశైలం కథ నం ప్రకారం.. పూడూరు మండలం హైదరాబాద్- బీజాపూర్ హైవే రో డ్డు అంగడి చిట్టంపల్లి స్టేజీ ధరణి కాటన్ మిల్ సమీపంలో సోమవారం ఉదయం 8 గంటల సమయంలో ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీ కొన్నాయి. దీంతో వికారాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న మల్లికార్జునరెడ్డి(61), దేవాన్ష్‌రెడ్డి(5) అక్కడికక్కడే మృతి చెందా రు. రాజ్యలక్ష్మి (56) చేవెళ్ల ప్రభుత్వం దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో వ్యక్తి సంతోష్‌రెడ్డికి తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్‌లోని దవాఖానకు తరలించారు. వీరు వికారాబాద్‌లోని బీటీఎస్ కాలనీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్‌లోని సన్ సిటీలో ఉంటున్న సంతోష్‌రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజినీర్. అతడితో పాటు నగరంలో మల్లికార్జునరెడ్డి, దేవాన్ష్‌రెడ్డి, రాజ్యలక్ష్మి ఉంటారు. తీవ్రగాయాలైన సంతోష్‌రెడ్డి భార్య స్వాతిరెడ్డి ఆమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. వీరంతా వికారాబాద్‌లోని బంధువుల ఇంట్లో ఆదివారం జరిగిన విందుకు హాజరయ్యారు. సోమవారం ఉదయం తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందడం, మరొకరికి తీవ్రగాయాలు కావడంతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. టయోటా కారు డ్రైవర్ గౌస్‌తో పాటు రహమాన్ ఉన్నట్లు పేర్కొన్నారు. డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తతో కారు డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు తెలిపారు.