కొండాపూర్, అక్టోబర్ 3 : సిగ్నల్ వద్ద ఆగి ఉన్న బైక్‌ను కారు ఢీకొట్టడంతో మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రవీంద్ర తెలిపిన వివరాల ప్రకారం… నేరేడ్మెట్కు చెందిన అజయ్ తన స్నేహితురాలు జెన్నిఫర్ మాదాపూర్‌లోని వేర్వేరు సంస్థల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం వీరిద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై కొత్తగూడ నుంచి సైబర్ టవర్స్ వైపు వెళ్తూ.. సీఐఐ జంక్షన్లో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగారు. ఈ క్రమంలో వెనక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా, జెన్నిఫర్ మృతి చెందింది. అజయ్‌కు బలమైన గాయాలైనట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.