బంజారాహిల్స్, ఆగస్టు 29: స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తున్న యువకుడు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్నది. ఫలక్‌నుమా సమీపంలోని జుబేల్కాలనీలో నివాసముంటున్న మహ్మద్ ముస్తాఫా ఫారూఖ్ (21) శనివారం రాత్రి తన స్నేహితులను కలిసేందుకు బంజారాహిల్స్‌కు వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్తుండగా, బంజారాహిల్స్ రోడ్ నం 1లో బైక్ అదుపు తప్పడంతో డివైడర్‌ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఫారూఖ్ అక్కడికక్కడే మృతి చెందగా, అతడి స్నేహితుడు అనాస్ అలీకి తీవ్రగాయాలయ్యాయి. అరగంటలో ఇంటికి వస్తున్నట్లు ముస్తాఫా ఫోన్ చేసినట్లు తండ్రి మహ్మద్ ఫారూఖ్ తెలిపారు. కొద్దిసేపట్లోనే తన కొడుకు దుర్మరణం పాలైనట్లు ఫోన్ రావడంతో ఆ తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ఖైరతాబాద్, ఆగస్టు 29 : ముగ్గురు యువకులు ట్రిపుల్ రైడింగ్ చేసి ఓ వ్యక్తి ప్రాణం తీశారు. పంజాగుట్ట అడ్మిన్ ఎస్సై కౌశిక్ తెలిపిన వివరాల ప్రకారం… బాచుపల్లి ప్రగతినగర్‌కు చెందిన షేక్ ముర్తుజా (46) లక్డీకాపూల్‌లోని ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు. ఆదివారం పని ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా, అమీర్‌పేట్ బిగ్‌బజార్ వద్ద రాంగ్ రూట్లో వచ్చిన ట్రిపుల్ రైడర్లు ఆయన వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో కిందపడిపోయి తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు గాంధీ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుమార్తె షేక్ షబానా బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.