కొండాపూర్, ఆగస్టు 26 : సొంతూరుకు బయలుదేరిన దంపతులు ప్రమాదానికి గురయ్యారు. వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో భార్య అక్కడికక్కడే మృతిచెందగా, భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన గురువారం ఉదయం గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్లో చోటు చేసుకున్నది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహబూబ్‌నగర్ నందిపహాడ్ గ్రామానికి చెందిన ఆమ్సాబ్, నూర్జహాన్ బేగం (45) దంపతులు శేరిలింగంపల్లి గోపీనగర్కాలనీలో నివాసముంటున్నారు. గురువారం ఉదయం మహబూబ్‌నగర్‌కు వెళ్లేందుకు బైక్‌పై బయలుదేరారు. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్లో సిగ్నల్ క్రాస్ చేస్తున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. దంపతులిద్దరూ కిందపడిపోగా, గమనించని డైవర్ ముందుకు వెళ్లడంతో టిప్పర్ టైర్ల కిందపడిన నూర్జహాన్ అక్కడికక్కడే మరణించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.