ఘట్కేసర్, ఆగస్టు 8 : స్థలం ఉండి ఇండ్లు కట్టుకోలేని పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకానికి పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లో దరఖాస్తులు తీసుకుంటున్నట్లు చైర్మన్లు ముల్లి పావనీజంగయ్య యాదవ్, బి.కొండల్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 9 నుంచి 10వ తేదీ వరకు ఈ దరఖాస్తులను మున్సిపాలిటీ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో తీసుకుంటారని తెలిపారు. ఇంటి స్థలం మహిళల పేరున మాత్రమే ఉండాలి, దరఖాస్తు కూడా మహిళల పేరున చేయాలి, ఆధార్, రేషన్‌కార్డు, ఓటర్ కార్డు, ఇంటి పత్రాలు, వ్యిదుత్ బిల్లు, ఇంటి పన్ను రశీదు, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్‌లతో దరఖాస్తు చేసుకోవాలని మున్సిపాలిటీ ప్రజలను చైర్మన్లు కోరారు. అర్హత గల మున్సిపాలిటీ ప్రజలు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ఘట్కేసర్ రూరల్‌లో…
ఘట్కేసర్ రూరల్, ఆగస్టు 8 : ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం కొరకు ఈనెల 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఘట్కేసర్ తహసీల్దార్ కృష్ణ తెలిపారు. మంగళవారం తహసీల్దార్ కృష్ణ మాట్లాడుతూ.. సొంత స్థలం ఉన్న వారు ఇల్లు నిర్మించుకునేందుకు గాను ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు రూ.3 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పథకం కొరకు దరఖాస్తు చేసుకునే వారు దరఖాస్తు ఫారంతోపాటు ఆధార్, ఓటర్, రేషన్ కార్డులతోపాటు బ్యాంక్ పాసు పుస్తకం, స్థలం పత్రాలు, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు, దివ్యాంగులైతే సదరం ధ్రువీకరణ పత్రాలను ఈనెల 10 లోపు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్నవారు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు.
శామీర్‌పేటలో…
శామీర్‌పేట, ఆగస్టు 8 : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తాసీల్దార్ సత్యనారాయణ మంగళవారం ప్రకటనలో తెలిపారు. పట్టా, గ్రామకంఠం ప్లాటు ఉండి ఇల్లు నిర్మాణం చేసుకోవాలనుకునే వారు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుకు ఈనెల 10 చివరి తేదీ అని, అర్హులైన, ఆసక్తిగల వారు దరఖాస్తులు తాసీల్దార్ కార్యాలయంలో అన్ని పత్రాలను జయపరిచి ఇవ్వాలన్నారు. ఇంటి నిర్మాణం లేని కాలి ప్లాటు ఉన్న వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇండ్లులేని నిరు పేదలు నిర్మించుకోవాలి : చైర్పర్సన్ దీపిక
మేడ్చల్, ఆగస్టు 8 : సొంత స్థలం ఉండి, ఇండ్లులేని నిరుపేదల ప్రయోజనార్థం ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని మేడ్చల్ పట్టణవాసులు వినియోగించుకోవాలని మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మర్రి దీపికానర్సింహ రెడ్డి సూచించారు. మంగళవారం చైర్పర్సన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణ ఇండ్లులేని నిరుపేదలకు ఇల్లు నిర్మించుకోవాలన్న సంకల్పంతో గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. సొంత స్థలం ఉండి, ఇల్లు నిరుపేదల ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేస్తుందన్నారు. మూడు దశల్లో రూ.3 లక్షలను బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయన్నారు. అర్హులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రెండు ఫొటోలు, ఆహార భద్రత కార్డు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, ఇంటి స్థల పత్రాలు, కరెంట్ బిల్లు రసీదు, బ్యాంక్ పుస్తకం ప్రతినిధి దరఖాస్తు ఫారానికి జత చేయాలని సూచించారు.