హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్న హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆరో రోజు పూర్తిస్థాయిలో సహకరించినట్లు తెలిసింది. ఒకవైపు అతని కుటుంబసభ్యులు, స్నేహితులను కలిపి ఏసీబీ అధికారులు విచారించడంతో సుమారు 120 ఎకరాల వివరాలు వెలుగులోకి వచ్చాయి.
ఔటర్ రింగ్ రోడ్డుతోపాటు రంగారెడ్డి, భువనగిరి, సిద్దిపేట, జనగాం, చౌటుప్పల్ ప్రాంతాల్లో ఎకరాలకొద్దీ భూములు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇవి పెద్ద సంఖ్యలో కుటుంబసభ్యులతోపాటు స్నేహితుల పేర్లపై బినామీ ఆస్తులుగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు తేల్చారు. వీరితోపాటుగా బాలకృష్ణతో సంబంధం ఉన్న పలువురు రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులను ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఆయా సంస్థలకు లబ్ధి చేకూర్చి హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ వాటాలు తీసుకున్నట్లు తెలిసింది.