సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే విధులు సక్రమంగా నిర్వర్తించగలమని ఎక్సైజ్ అకాడమీ డైరెక్టర్ సయ్యద్ యాసిన్ ఖురేషీ అన్నారు. ఆబ్కారీ శాఖలో కొత్తగా ఎంపికైన 86 మంది కానిస్టేబుళ్ల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాన్ని బండ్లగూడ, ఆరెమైసమ్మ ప్రాంతంలోని ఎక్సైజ్ అకాడమిలో సోమవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ ఖురేషీ మాట్లాడుతూ ఇతర ఉద్యోగాల కంటే పోలీసు ఉద్యోగం కొంత భిన్నంగా ఉంటుందన్నారు. లా అండ్ అర్డర్‌తో పాటు ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుళ్లుగా పని చేయాలంటే ఉద్యోగిలో తగినంత సామార్థ్యం, ధైర్యం ఉండాలన్నారు. ఈ రెండింటితోపాటు మారుతున్న కాలానికనుగుణంగా టెక్నాలజీ, నూతన ఐడియాలజి కూడా అలవర్చుకోవాలని చెప్పారు.
ముఖ్యంగా ఎక్సైజ్ శాఖలో క్రైమ్ కంట్రోల్‌పై పని చేయాల్సి ఉంటుందని, గంజాయి, డ్రగ్స్, ఎన్పీడీఎల్, నాటుసార, నకిలీ మద్యం తయారీ వంటి వాటిని అరికట్టడంతోపాటు ఎక్సైజ్ విధులు నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. కాగా నూతనంగా నియామకమైన ఉద్యోగులకు 90రోజుల శిక్షణా ఉంటుందని, మొదటి విడతలో 45రోజులు, రెండో విడతలో మరో 45రోజుల పాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అకాడమీ జాయింట్ డైరెక్టర్ శశిధార్ రెడ్డి, చీఫ్ డ్రిల్లింగ్ ఇన్ స్పెక్టర్ రాము తదితరులు పాల్గొన్నారు.