కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 11: పాఠశాల యాజమాన్యం ర్యాగింగ్‌పై దృష్టి సారించకపోవడంతో ఓ విద్యార్థి మానసిక వేధింపులకు గురయ్యాడు. దీంతో బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిని నిరసిస్తూ ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలు, బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు గుండ్లపోచంపల్లి డీఆర్ఎస్ స్కూల్ ఎదుట ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు, బాధిత విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ఈ పాఠశాలలో శోభాంగ్ సేవక్ 8వ తరగతి చదువుతున్నాడు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు శోభాంగ్ను మానసికంగా వేధింపులకు గురి చేయడంతో పాటు దాడి చేసి ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పి తప్పించుకున్నారని పేర్కొన్నారు. మరికొంత మంది విద్యార్థులు కూడా ర్యాగింగ్‌కు గురైనట్టు వారు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
పాఠశాల ఆవరణలో ర్యాగింగ్‌తో పాటు విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగం కూడా జరుగుతున్నదని, అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారిన ఈ పాఠశాల యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారులు, పోలీస్ యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై పేట్‌బషీరాబాద్ ఇన్స్పెక్టర్ విజయ్వర్ధన్ను వివరణ కోరగా, బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని, ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.