Hyderabad | బంజారాహిల్స్, మార్చి 27 : అర్ధరాత్రి వేళ ఓపెన్ టాప్ జీప్లో ప్రయాణిస్తూ చేతిలో తుపాకీతో హల్చల్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. బంజారా హిల్స్ రోడ్ నెంబర్-1లోని సర్వీ హోటల్ సమీపంలో కొంతమంది యువకులు ఓపెన్ టాప్ జీప్లో అతివేగంగా ప్రయాణిస్తూ గట్టిగా కేకలు వేస్తుండడంతోపాటు రోడ్డు మీద పోయే వారిని భయబ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయింది. యువకుల్లో ఒకరు తన చేతిలో తుపాకీ గాల్లోకి చూపిస్తూ హల్చల్ చేశారు. దీంతో ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో గుర్తించిన బంజారాహిల్స్ పోలీసులు సుమోటోగా ఆకతాయిల మీద బీఎన్ఎస్ 125, 292,351(2) తో పాటు ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.