మలక్పేట, జూన్ 13 : అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసారాంబాగ్ ఎస్బీఐ కాలనీలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ముసారాంబాగ్ డివిజన్ సీనియర్ బిజెపి నాయకులు రాము యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి ఎస్బీఐ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. గురువారం రాత్రి భోజనానంతరం కుటుంబ సభ్యులందరూ నిద్రకు ఉపక్రమించారు. శుక్రవారం ఉదయం లేచిన రాము యాదవ్ తన కుమారుడు సందీప్ యాదవ్ (35) నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి చూడగా విగతజీవిలా పడి ఉండటంతో వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
ఎదిగిన కొడుకు కళ్ళముందే విగత జీవిలా మారడంతో గుండెలవిసేలా రోదించిన ఆ తల్లిదండ్రుల తీరు పలువురిని కంటతడి పెట్టించింది. జరిగిన ఘటనపై రాము యాదవ్ మలక్ పేట పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పరిశీలించి బ్లూమెక్స్ అనే పురుగుల మందు తాగి మరణించినట్లు నిర్ధారించారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలను వివిధ కోణాల్లో శోధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రేమ విఫలమా, ఆర్థిక కారణాలతోనా, లేక మరే ఇతర కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు మలక్పేట ఇన్స్పెక్టర్ పిడమర్తి నరేష్ తెలిపారు. కాగా సందీప్ యాదవ్ వారి కులానికే చెందిన ఓ వివాహితను ప్రేమిస్తున్నట్లు, పెళ్లి చేసుకుందామని ఆమె వెంటపడి వేధించటంతో నాలుగు రోజుల క్రితం సదరు మహిళ మలక్ పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు సమాచారం.