Suicide | మియాపూర్, ఫిబ్రవరి 11 : ఫోన్ చూడవద్దని తల్లి మందలించడంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్‌లోని న్యూ ఆఫీస్ పెట్ మార్తాండ నగర్లో రత్నప్రభ తన కుమారుడు శౌర్య సింగ్(17), ఇద్దరు కూతుర్లతో కలిసి నివాసం ఉంటుంది. స్థానికంగా బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంది. సోమవారం సాయంత్రం శౌర్యసింగ్ ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు. ఎప్పుడూ ఫోన్ పట్టుకొని ఎందుకు కూర్చుంటున్నావని తల్లి మందలించింది. దీంతో శౌర్య సింగ్ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. రాత్రి 8:30 గంటల సమయంలో కుటుంబ సభ్యులు తలుపులు కొట్టగా లోపలి నుండి గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా పలుక లేదు. దీంతో తలుపును బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా శౌర్యాసింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే కుటుంబ సభ్యులు కిందికి దించి కొండాపూర్‌లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరిశీలించి మృతి చెందినట్లు గుర్తించారు.
సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. శౌర్యాసింగ్ పదవ తరగతి ఓపెన్‌లో చదువుతున్నాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.