Suicide | శేరిలింగంపల్లి, జూన్ 1: బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ పైనుంచి ఓ వ్యక్తి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, కుంటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం… శ్రీకాకుళం జిల్లా హీరా మండలం అంబేద్కర్ నగర్ ప్రాంతానికి చెందిన గొట్టివాడ చిన్నా ఆలియాస్ సూర్య(28) ఒడిషాకు చెందిన రమ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మాదాపూర్‌లో భార్యతో ఉంటూ పెయింటర్‌గా పని చేస్తున్నాడు. కొంత కాలంగా భార్యాభర్తలు ఇద్దరికి గొడవలు జరుగుతండటంతో ఇద్దరు వేర్వేరుగా ఉన్నారు.
ఇటీవల మళ్లీ కలిసి మాదాపూర్‌లోనే ఉంటున్నారు. భార్య తరుపు బంధువులు రావడంతో మళ్లీ గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం చిన్నా భార్య రమ్యతో గొడవపడి బయటకు వచ్చాడు. గచ్చిబౌలిలో ఉండే తన సోదరి యమున వద్దకు వచ్చాడు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా భార్య లిఫ్ట్ చేయకపోవడంతో మధ్యాహ్నం సమయంలో సోదరి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం 3.52 గంటల సమయంలో నేను వెళ్లి పోతున్నా. మీరు జాగ్రత్తగా ఉండండి అని అక్క బావకు వాయిస్ మేసేజ్ పెట్టాడు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే కొత్తగూడ ఫ్లైఓవర్ మీది నుంచి బొటానికల్ గార్డెన్ జంక్షన్లో దూకాడు. తీవ్ర గాయాలు కావడంతో మసీద్ బండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భార్య రమ్య, బంధువులతో గొడవల కారణంగానే తన సోదరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని సోదరి యమున గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.