బలవంతంగా అబార్షన్స్.. నిలదీస్తే చిత్రహింసలు
యువతి ఫిర్యాదు.. కేసు నమోదు
Hyderabad | బంజారాహిల్స్, మే 21: ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు.. పెండ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకున్నాడు ఓ యువకుడు. దీంతో ఆ యువతి గర్భం దాల్చడంతో ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా మూడుసార్లు అబార్షన్ చేయించాడు. పెండ్లి కోసం ఒత్తిడి చేయడంతో విచక్షణారహితంగా దాడి చేయడంతోపాటు ఇంట్లో నుంచి తరిమివేశాడు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే రాజీ చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో ఫిలింనగర్ పోలీసులు అర్చిత్ పసుపులేటి అనే యువకుడితోపాటు అతడికి సహకరించిన ఇద్దరి స్నేహితులపై కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్ సమీపంలోని సినోర్ కాలనీలో నివాసం ఉంటున్న అర్చిత్ పసుపులేటి (28) సాఫ్ట్వేర్ సంస్థ డైరెక్టర్గా ఉన్నాడు. అతడికి కామన్ ఫ్రెండ్స్ ద్వారా రెండేళ్ల కిందట ఓ యువతి(24) పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెండ్లి చేసుకుంటానని నమ్మించిన అర్చిత్ ఆమెను లోబర్చుకున్నాడు. కాగా, యువతి గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు. పెండ్లి విషయంపై నిలదీయగా కొంత సమయం ఇవ్వాలని కోరేవాడు. ఇలా మరో రెండుసార్లు ఆమెకు బలవంతంగా అబార్షన్స్ చేయించడంతో ఆరోగ్యంపై ప్రభావం పడింది. దీంతో అర్చిత్ మరో యువతితో సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టాడు.
విషయం తెలుసుకున్న యువతి ఫిబ్రవరి 20వ తేదీన అతడి ఇంటికి వెళ్లి నిలదీయగా.. అతడి కుటుంబసభ్యులు ఆమెను వెళ్లగొట్టారు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంటానని యువతి బెదిరించగా.. అర్చిత్ ఆమెపై దాడి చేయడంతో పాటు స్నేహితులు కావ్య, ఆదిత్య వద్దకు తీసుకువెళ్లి అవహేళన చేశాడు. దీంతో ఆమె ఫిబ్రవరి 24న ఇంట్లో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో అక్కడి నుంచి అర్చిత్ ఇంటి వద్దకు రావడంతో తరిమేశారు. ఫిలింనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను అపోలో ఆస్పత్రిలో చేర్చారు. రెండ్రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాధితురాలు ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అర్చిత్ కుటుంబసభ్యులను పీఎస్కు పిలిపించారు. ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని, తిరిగి అర్చిత్ వద్దకు రానంటూ కొన్ని కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు. బాధితురాలు మంగళవారం రాత్రి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అర్చిత్ పసుపులేటితోపాటు అతడికి సహకరించిన స్నేహితురాలు కావ్య పొట్లూరి, ఆదిత్య సయ్యపరాజుపై బీఎన్ఎస్ 69, 79, 351(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.