Hyderabad | బంజారాహిల్స్, ఏప్రిల్ 19 : పని చేస్తున్న సంస్థలో ఓ ఉద్యోగి తన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాడంటూ ఓ యువతి భవనం మీదకు ఎక్కి హల్చల్ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. నాదర్గుల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న శివలీల (32) అనే యువతి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో నిర్మాణంలో ఉన్న ఏఐజీ ఆస్పత్రి భవనంలో గత కొన్ని నెలలుగా హౌస్ కీపింగ్ సూపర్ వైజర్‌గా పని చేస్తోంది. అక్కడే ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తున్న రమేష్ అనే వ్యక్తి శివలీల గురించి తప్పుడు ప్రచారం చేయడంతో పాటు చీటికిమాటికి గొడవ పడుతున్నాడు. ఈ విషయాన్ని గురించి తాను పనిచేస్తున్న సంస్థ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన శివలీల శనివారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఆస్పత్రి మీదకు ఎక్కి ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరిస్తూ హంగామా చేసింది.
సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను కిందకు దించే ప్రయత్నాలు చేయగా తన వద్దకు వస్తే తాను కిందికి దూకి చనిపోతానని బెదిరించింది. లేనిపోని చాడీలు చెప్పి తనను గచ్చిబౌలికి బదిలీ చేయించిన రమేష్ మీద చర్యలు తీసుకోవాలని, ఇక్కడే ఉద్యోగం ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. దీంతో బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర రంగంలోకి దిగి యాజమాన్యంతో చర్చించారు. రమేష్‌పై చర్యలు తీసుకునేందుకు యాజమాన్యం ముందుకు రావడంతో, శివలీల కిందికి దిగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.