సిటీబ్యూరో, జూలై 31 (నమస్తే తెలంగాణ ) : వడ్డించే వాడు మనోడైతే..బంతిలో ఎక్కడ కూర్చున్న పర్వాలేదు అన్న చందంగా ఉన్నది బల్దియా తీరు. రూ. లక్షలు బకాయి ఉన్న ఏజెన్సీ నుంచి ముక్కు పిండి వసూలు చేయాల్సిన అధికారులు ….డీఫాల్టర్కే అడ్డికి పావు సేరులా ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్వోబీ)ని ధారాదత్తం చేశారు. ప్రకటన బోర్డు ఎత్తు భూమి నుంచి 15 అడుగుల లోపే ఉండాలనే నిబంధనను కూడా మినహాయించారు. అమల్లో ఉన్న జీవో నం. 68 మార్గదర్శకాలు సంబంధిత ఏజెన్సీకి వర్తించవని, యథేచ్ఛగా ఎల్ఈడీ బోర్డులు ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొంటూ.. గతేడాది మార్చి 15న అప్పటి పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ప్రత్యేకంగా జీవో నంబరు 156ను జారీ చేశారు.
ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన వద్ద ఎఫ్వోబీ, ఎంజే మార్కెట్ వద్ద పేరొందిన యాడ్ ఏజెన్సీకి నిర్వహణ ముసుగులో అప్పన్నంగా చదరపు మీటర్‌కు వార్షికంగా రూ. 5500/- ఫీజును నిర్ణయించి కట్టబెట్టింది. ఈ లెక్కన ఆ సంస్థ సంబంధిత యాడ్ కంపెనీ నెలకు ప్రకటనల రూపంలో రూ.కోటి మేర ఆర్జిస్తూ బల్దియాకు మాత్రం వార్షికంగా రూ. లక్షల్లో ఫీజులు చెల్లిస్తోంది. ఇలా ఆ సంస్థ కోసం అధికారులు అడ్డగోలు నిబంధనలు, అక్కరలేని మినహాయింపులతో బల్దియా ఖజానాకు గండికొట్టడం గమనార్హం.
అడుగడుగునా ఉల్లంఘనలే..!
వాణిజ్య కేంద్రమైన ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన ముందు పాదచారుల సౌకర్యార్థం 2016 సంవత్సరం చివర్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. ఈ నిర్మాణ పనుల్లో భాగస్వామ్యం అయిన సదరు ఏజెన్సీకి ఈ ఎఫ్వోబీ నిర్వహణ, జీవో నం. 68 ప్రకారంగా ప్రకటనలను అనుమతి ఇచ్చారు. అయితే సదరు ఏజెన్సీ ఒప్పందం ప్రకారం ఏటా రూ.20 లక్షల మేర బల్దియాకు చెల్లించాల్సి ఉండగా..నేటి వరకు రూ. కోట్లలో బకాయి ఉంది.
కొందరి అధికారుల అండతో న్యాయస్థానం మెట్లు ఎక్కి బకాయిలు కట్టకుండా బల్దియా ఖజానాకు టోకరా వేస్తు వస్తున్నాడు. అయితే ఘనత వహించిన కాంగ్రెస్ పాలనలో సదరు డీఫాల్టర్ ఉన్న ఏజెన్సీకి పట్టం కట్టారు. ప్రయోగాత్మక ప్రాజెక్టు పేరిట కోట్లు వచ్చే చోట లక్షల్లో ఫీజును నిర్ణయించి ఉదారత చాటుకున్నారు.
బంజారాహిల్స్ వంటి వాణిజ్య కేంద్రంలో అడ్డికి పావు సేరు తరహాలో ఎఫ్‌ఓబీలను బల్దియా ఎన్నో మినహాయింపులతో ఈ సంస్థకు కట్టబెట్టేలా ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన ఎఫ్ఓబీని కట్టబెట్టింది. వాస్తవంగా ఎల్ఈడీ బోర్డులు గ్రేటర్లో నిషేధం. అమలు చేయాలంటే హైకోర్టు ఆదేశాలు తప్పనిసరి..కానీ ఇవేమి ఇక్కడ పట్టించుకోకుండా సదరు ఏజెన్సీకి ఎల్ఈడీ స్క్రీన్ ప్రకటనలకు అనుమతి ఇచ్చారు. తొలుత ఆరు నెలలుగా, నిర్వహణలో మెరుగైన పనితీరును బట్టి మరో ఆరు నెలలుగా అవకాశం కల్పించారు.
ఈ జీవో ఇచ్చి ఏడాది గడిచినా గుట్టు చప్పుడు కాకుండా సంబంధిత ఏజెన్సీకి సెప్టెంబరు వరకు చాన్స్ ఇచ్చారు. అయితే ఫీజుల విషయంలోనూ అధికారులు అమలు చేస్తున్న విధానం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. ఉదాహరణకు చదరపు మీటర్‌కు వార్షికంగా రూ. 5500/- ఫీజును నిర్ణయించింది. ఈ లెక్కన ఆ సంస్థ సంబంధిత యాడ్ కంపెనీల నుంచి వేలల్లో వసూలు చేసినా… ఏజెన్సీ మాత్రం తక్కువ మొత్తంలోనే బల్దియాకు వార్షికంగా ఫీజులు చెల్లిస్తోంది.
ఎల్ఈడీ స్క్రీన్ రెండు వైపులా ఏర్పాటు చేయగా..ఒక ైస్లెడ్ ప్రకటనకు దాదాపు రూ..6 లక్షల మేర ఏజెన్సీ వాణిజ్య, వ్యాపార సంస్థల నుంచి వసూలు చేస్తుంది. పది ైస్లెడ్లు, అందులో రెండు వైపులా కలిపి నెలకు దాదాపుగా రూ. కోటి మేర ఆదాయాన్ని ఆర్జిస్తున్నది..కానీ బల్దియాకు మాత్రం రూ. లక్షల్లో మాత్రమే ఫీజులు చెల్లిస్తున్నది. నిర్వహణ విషయానికొస్తే ఎస్కలేటర్లు సరిగా పనిచేయవు.. సెక్యూరిటీ ఉండరు..సీసీ కెమెరాలు సరిగా పనిచేయవు..వీటిని పర్యవేక్షించే ఉన్నతాధికారే లేకపోవడంతో సదరు ఏజెన్సీ ఇష్టారాజ్యంగా మారిందని ఎలాంటి సందేహం లేదు.
కాంగ్రెస్ ప్రజాప్రతినిధి అండ?
డీఫాల్టర్ ఎజెన్సీకి ఈ ఎఫ్వోబీ ఎల్ఈడీ స్క్రీన్ ప్రాజెక్టు రావడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ మాజీ మంత్రి తనయుడి హస్తం ఉన్నట్లు ప్రచారం సాగుతున్నది. ఈ కంపెనీకి అన్నీ తానై నడిపిస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతున్నది. జీవో నం. 68 నుంచి మినహాయింపు ఇప్పించడమే కాకుండా నామమాత్రపు ఫీజులతో దందాకు తెరలేపాడని, అధికారులు సైతం సదరు ప్రజాప్రతినిధి ఒత్తిడికి ఏమి చేయలేని పరిస్థితులు ఉన్నాయని ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది. దీనిపై జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతిని వివరణ కోరే ప్రయత్నం చేయగా,.ఫోన్లో అందుబాటులోకి రాలేదు.