బంజారాహిల్స్, ఆగస్టు 3 : యూట్యూబ్‌లోని పాటలను తస్కరించడంతో పాటు రూ.10 లక్షలు ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని జవహర్ కాలనీలో నివాసం ఉంటున్న రమావత్ విజయ్‌కుమార్ అనే యువకుడు బంజారా, గిరిజన ప్రాంతాలకు చెందిన జానపద గీతాలు పాడుతూ యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుంటారు. అతడి యూట్యూబ్ చానెల్‌కు సుమారు 10 లక్షల మంది వ్యూయర్స్ ఉన్నారు.
కాగా విజయ్‌కుమార్ యూట్యూబ్ చానెల్లో పెట్టిన సాంగ్స్‌ను మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి అనుమతులు లేకుండా తన యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేసుకుంటూ డబ్బులు దండుకుంటున్నాడు. దీంతో పాటు తనవే ఒరిజినల్ సాంగ్స్ అని, రమావత్ విజయ్‌కుమార్ పెట్టిన సాంగ్స్ తనవే అంటూ యూ ట్యూబ్ నిర్వాహకులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో మూడు పాటలను ఇదే విధంగా కాజేయడంతో పాటు యూట్యూబ్‌లో నుంచి బ్లాక్ చేయించాడు. దీంతో అతడి ఫోన్ నెంబర్‌ను తీసుకున్న విజయ్‌కుమార్ ఫోన్ చేయగా గుర్తుతెలియని వ్యక్తి దుర్భాషలాడాడు. తనకు రూ. 10 లక్షలు ఇస్తేనే పాటలు పెట్టకుండా ఉంటానని, విజయ్‌కుమార్ మీద యూట్యూబ్ నిర్వాహకులకు ఇచ్చిన ఫిర్యాదులు వెనక్కి తీసుకుంటానంటూ బ్లాక్మెయిల్ చేశాడు. ఈ మేరకు బాధితుడు రమావత్ విజయ్‌కుమార్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా బీఎన్ఎస్ 308(2),352(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.